మైసూరు: కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ వారినే లక్ష్యంగా చేసుకుని ఈడీ దాడులు చేయిస్తోందని, బీజేపీ వారిని కాపాడుతోందని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ఆయన మంగళవారం చామరాజనగర జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డీసీఎం డీకే శివకుమార్‌తో కలిసి పాల్గొన్నారు. గుండ్లుపేటె హెలిప్యాడ్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్, కుమారుడు నలపాడ్ ఇంటిపై ఈడీ దాడి చేసిందంటూ పై విమర్శలు చేశారు. ఏ కేసు వచ్చినా కాంగ్రెస్ నాయకుల ఇళ్ల మీదకు ఈడీ వస్తోందన్నారు. దావణగెరెలో మైనార్టీ నాయకుల సమక్షంలోనే అభ్యర్థిని ఎంపిక చేశాం, కానీ మైనార్టీ నాయకులు పార్టీ తరఫున పని చేయలేదని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
అది మూఢ నమ్మకమే
మూఢ నమ్మకాలపై తనకు నమ్మకం లేదని, అందువల్లే చామరాజనగరకు చాలాసార్లు వచ్చి వెళ్లానని అన్నారు. ఇక్కడకు వస్తే తన కుర్చీ ఇంకా బలంగా ఉంటుందని చమత్కరించారు. చామరాజనగర జిల్లా ఆస్పత్రిలో గతంలో కరోనా సమయంలో ఆక్సిజన్ అందక పలువురు మరణించిన కేసులో కారకులపై చర్యలు ఉంటాయన్నారు.
వారే మహిళా వ్యతిరేకులు
బీజేపీ వారే మహిళా రిజర్వేషన్ వ్యతిరేకులని సీఎం అన్నారు. తమది నియోజకవర్గాల పునర్విభజనపై వ్యతిరేకతే తప్ప మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాదు అని అన్నారు. తృతీయ భాషకు గతంలో మాదిరిగా మూల్యాంకనం చేసి మార్కులు ఇవ్వాలనే హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని సీఎం అన్నారు. దావణగెరె, బాగలకోటె ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయమని చెప్పారు. సీఎం నియోజకవర్గంలో చనిపోయిన వారి కుటుంబాలకు మాత్రమే పరిహారం అందిస్తున్నారన్న జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ చందాపుర ఆరోపించడంపై స్పందిస్తూ అందరి కుటుంబాలకు ఇస్తున్నామని అన్నారు.
10 రోజుల్లో మేకెదాటు డీపీఆర్: డీసీఎం
మైసూరు: కావేరి నదిపై మేకెదాటు డ్యాం నిర్మాణ విషయంలో కాంగ్రెస్ విజయం సాధించిందని, 10 రోజుల్లోగా ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్)ను కేంద్రానికి సమర్పిస్తామని డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. పిరియాపట్నంలో రూ. 419 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మేకెదాటు విషయంలో అన్నిచోట్లా అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలోని కేంద్ర మంత్రి కుమారస్వామికి అధికారం ఉంటే, ప్రాజెక్టు అమలులో సహకరించాలని సవాలు విసిరారు. తమ గ్యారంటీల కార్యక్రమం యావత్ దేశానికి ఒక ఆదర్శమని అన్నారు.
గుండ్లుపేటెలో జరిగిన సభలో సీఎం, డీసీఎం
రిమోట్‌తో ప్రారంభోత్సవం
బీజేపీ వారిని కాపాడుతారా!
కేంద్రంపై సీఎం సిద్దు ఆగ్రహం


