సాక్షి బళ్లారి: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్‌తో పాటు పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు వీగిపోయిన తరుణంలో ఆయా పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆందోళనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చట్టసభల్లో మహిళలకు వెంటనే రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. నగరంలోని సంగం సర్కిల్ నుంచి జిల్లా మహిళా కాంగ్రెస్ నేతలు, డీసీసీ అధ్యక్షుడు, పలువురు మహిళా విభాగాల ప్రముఖులు ర్యాలీ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. 2023లోనే ఈ బిల్లు లోక్‌సభలో, రాజ్యసభలో ఆమోదం పొందిందని గుర్తు చేశారు.
మళ్లీ బిల్లును ఎందుకు ప్రవేశ పెట్టారు?
అలాంటప్పుడు మళ్లీ ఎందుకు బిల్లును ప్రవేశపెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ ఈ కుట్ర చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి లేకపోవడంతో కుటిల రాజకీయాలు చేస్తోందన్నారు. తక్షణం మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్, మాజీ బుడా అధ్యక్షుడు హుమయూన్‌ఖాన్, మహిళా విభాగం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్.మంజుల, కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఎల్.మారెన్న, మానయ్య తదితరులు పాల్గొన్నారు.
కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు
నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన


