గాలీవాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలీవాన బీభత్సం

Apr 21 2026 4:20 AM | Updated on Apr 21 2026 4:20 AM

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు

కూలి పడిన చెట్లు, నీట మునిగిన

వంతెనతో నిలిచిన ట్రాఫిక్‌

హుబ్లీ: నవలగుందతో పాటు తాలూకాలోని కొన్ని గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కొన్ని చెట్లు నేలకూలాయి. ఆదివారం సాయంత్రం కురిసిన భారీ గాలులతో కూడిన వర్షాల వల్ల అక్కడక్కడా విద్యుత్‌ స్తంభాలు కూలి పడ్డాయి. తాలూకా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా నాలుగు గంటలకు పైగా విద్యుత్‌ సరఫరా స్తంభించింది. పట్టణ శివారులోని అంబలి వాగు దిగువ వంతెన మునగడంతో ఇబ్రహింపుర గ్రామానికి వెళుతున్న బస్సు వాగు పక్కనే రెండు గంటల పాటు నిలిచి పోయింది. నీటి ప్రవాహ ఉధృతి తగ్గుముఖం పట్టిన తర్వాత బస్సు తిరిగి బయలుదేరింది. పట్టణ శెట్టర చెరువు దగ్గర ఉన్న అంగళ్లపై రేకులు గాలిలోకి ఎగిరి వచ్చి రోడ్డు మీద వెళుతున్న ద్విచక్ర వాహన చోదకుడు కుమారగొప్ప గ్రామ యువకుడి తలపై పడటంతో దెబ్బ తగిలింది. బెళెహార గ్రామంలో పొట్టు గోడౌన్‌పై పిడుగు పడి అగ్నిప్రమాదం వాటిల్లింది. దీంతో అణ్ణిగేరి నుంచి వచ్చిన అగ్నిమాపక దళ సిబ్బంది మంటలు ఆర్పడానికి శ్రమించారు. అదృష్టం కొద్ది ఎలాంటి ప్రాణహాని జరగలేదు. మొత్తం మీద ఎండా కాలంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల నవలగుంద పట్టణంతో పాటు తాలూకాలో వేర్వేరు గ్రామాల్లో బసవ జయంతి తదితర కార్యక్రమాలతో పాటు గ్రామ దేవి జాతర ఉత్సవాలకు అడ్డంకులు ఏర్పడ్డాయి.

అక్రమంగా తరలిస్తున్న శెనగల లారీ జప్తు

హుబ్లీ: ప్రభుత్వానికి చెందాల్సిన మార్కెట్‌ పన్ను వంచించి ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా శెనగలను తరలిస్తున్న లారీని కుందగోళ ఏపీఎంసీ అధికారులు జప్తు చేసి జరిమానా విధించారు. హుబ్లీ లక్ష్మేశ్వర మార్గంలో వెళుతున్న లారీలో ఎటువంటి బిల్లులు లేకుండా 787 బస్తాల శెనగలను తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కార్యాచరణ చేపట్టిన ఏపీఎంసీ అధికారులు వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అక్రమాలు వెలుగు చూశాయి. లారీలో సుమారు రూ.8.16 లక్షల విలువ చేసే 170 క్వింటాళ్ల శెనగలకు డ్రైవర్‌ వద్ద ఎలాంటి దాఖలాలు లభించలేదు. దీంతో అధికారులు లారీని అక్కడి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌కు రూ.19,584 జరిమానా విధించినట్లు కుందగోళ ఏపీఎంసీ ఇన్‌చార్జి కార్యదర్శి వినాయక ఓ ప్రకటనలో తెలిపారు.

వేధించాడని యువకుడికి చెప్పుదెబ్బ

హుబ్లీ: తుమారా ఫోన్‌ నెంబర్‌ దేవో అన్న యువకుడిని ఓ మహిళ చెప్పుతో కొట్టిన ఘటన ఇక్కడి శిగ్గాంవి పార్కు బ్యారేజీ వద్ద చోటు చేసుకుంది. యూపీకి చెందిన సెలూన్‌ అంగడి నిర్వాహకుడు ఫరూక్‌ జమీల్‌ అహ్మద్‌ బాధితుడు. సదరు మహిళ వెంటపడటం, ఆమె ఇంటి ముందే బైక్‌ నిలపడం, వారి పిల్లలు కరాటే క్లాస్‌కు వెళ్లినప్పుడు ఫాలో చేసేవాడు. ఇంట్లోకి దొంగ చూపులతో తొంగితొంగి చూసేవాడు. దీంతో అతడి తీరుపై ఆమె విసిగి వేసారింది. పిల్లలను కరాటే క్లాస్‌ నుంచి ఇంటికి తీసుకు రాగా ఫరూక్‌ ఆమె ఇంటి వద్దకు వచ్చి తుమారా ఫోన్‌ నెంబర్‌ దేవో అని ఆమె ఒంటి మీద పడటానికి ప్రయత్నించాడు. దీంతో కోపగించుకున్న మహిళ చెప్పుతో కొట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్‌ చేసి ఫరూక్‌ను వారికి అప్పగించారు.

పట్టపగలే వ్యక్తి దారుణ హత్య

సాక్షి,బళ్లారి: పట్టపగలే కలబుర్గి జిల్లాలో దారుణ హత్య జరిగింది. సోమవారం కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకా వాడి పట్టణంలో బలరామ చౌరస్తాలో ఇర్ఫాన్‌ (42) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇర్ఫాన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన అనంతరం మారణాయుధాలతో కూడా దాడి చేసి దారుణంగా చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దుండగులు హత్య చేసిన తర్వాత పారిపోయారు. స్థానికులు అందించిన సమాచారంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ హత్య పాత వైరం, గొడవల వల్లే జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టపగలు నడి రోడ్డులో దారుణంగా హత్య చేయడంతో స్థానికులు భయాందోళన చెందారు. కాల్పుల మోతతో కలబుర్గి జిల్లా వాడి పట్టణం దద్దరిల్లింది.

తెలంగాణ పాత్రికేయులకు పాలసీ బాండ్లు

రాయచూరు రూరల్‌: తెలంగాణలో పత్రికా రంగంలో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులకు బీఆర్‌ఎస్‌ నారాయణపేట జిల్లాధ్యక్షుడు, నవోదయ వైద్య కళాశాల ట్రస్టీ ఎస్‌.రాజేందర్‌రెడ్డి పాలసీ బాండ్లను అందించారు. నారాయణపేట జిల్లా కోయిలకొండ మండలంలోని పాత్రికేయ కుటుంబాలకు సొంత డబ్బుతో రూ.15 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా పాలీసీలను అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ గౌరవ వేతనంతో పని చేసే వారికి ఆపత్కాలంలో ఈ బాండ్లు ఎంతో ఉపయోగ పడతాయన్నారు.

విద్యుదాఘాతంతో కార్మికుడు బలి

హోసూరు: కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో టైల్స్‌ వేస్తుండగా విద్యుత్‌ వైరును తాకి కార్మికుడు మృతి చెందిన ఘటన పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. తళి హడ్కో గృహ వసతికి చెందిన కాశిరామ్‌ (48) ఆదివారం కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో టైల్స్‌ వేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్‌ వైరు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటనలో కాశిరామ్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకొన్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement