హంస వాహనంపై వీణాపాణి
కదిరి: ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు ఆదివారం రాత్రి వీణాపాణిగా హంస వాహనంపై చదువుల తల్లి సరస్వతి అవతారంలో తిరువీధుల్లో దర్శనమిచ్చారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టు పీతాంబరాలు ధరించిన స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మికానందంలో మునిగితేలారు. బ్రహ్మ వాహనమైన హంసకు ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచి, చెడును గ్రహించ గలిగిన అపురూపమైన శక్తి దీని సొంతం. అందుకే ఉపనిషత్తులు పరమేశ్వరునిగా అభివర్ణిస్తున్నాయి. హంస వాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో ఊరేగుతున్న నారసింహుడిని దర్శించుకుంటే అహంభావాన్ని తొలగించి శరణాగతిని కల్గిస్తాడని అర్చక పండితులు తెలిపారు.
నేడు సింహ వాహనం
బ్రహోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు సోమవారం సింహ వాహనంపై దర్శనమిస్తారు. మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని లోకానికి చాటిచెప్పడానికే శ్రీవారు సింహవాహనంపై ఊరేగుతారని భక్తుల నమ్మకం. యాగశాల ప్రవేశం, నిత్యహోమాలతో ప్రారంభమై శ్రీవారి తిరువీధుల మంటపోత్సవం నిర్వహిస్తారు.


