ముగ్గురి ఊపిరి తీసిన ఇంకుడు గుంత
దొడ్డబళ్లాపురం: వర్షపు నీరు ఇంకడానికి తవ్వుకున్న ఇంకుడు గుంత ఇంటి యజమానితో పాటు మొత్తం ముగ్గురిని పొట్టనపెట్టుకుంది. బెంగళూరు వైట్‌ఫీల్డ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మునిశ్యామప్ప (67), రుద్రకుమార్(40), విశ్వనాథ్ ఆచారి (24) మృతులు. వివరాలు.. ఇమ్మడిహళ్లి దేవాలయం సర్కిల్‌లో ఇంటి యజమాని మునిశ్యామప్ప 12 ఏళ్ల క్రితం వర్షపు నీటిని ఆదా చేయడానికి ఇంకుడు గుంతను నిర్మించాడు. అందులోకి చెత్తపడి కుళ్లిన వాసన వస్తుండడంతో శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇరుకుగా ఉన్న గుంతలో దిగి క్లీన్ చేస్తుండగా ఊపిరి అందక మూర్ఛపోయాడు. అతడిని రక్షించే క్రమంలో ప్లంబర్ రుద్రకుమార్ లోపలకు దిగి స్పృహ తప్పాడు. ఆపై విశ్వనాథ్ లోపలికి దిగి అతడు కూడా ఊపిరాడక పడిపోయాడు. స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించే పనిలో ఉండగానే ముగ్గురూ మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


