నాయకత్వ వివాదానికి తెర దించాలి
శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పిడి అంశానికి తెరపడినట్లేనని అంటుండగానే కాంగ్రెస్‌కు చెందిన 35 మందికి పైగా ఎమ్మెల్యేలు గురువారం రాత్రి విందు భోజన సమావేశం జరిపి నాయకత్వ గందరగోళాన్ని పరిష్కరించాలని హైకమాండ్ ముందు డిమాండ్ పెట్టారు. ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ సన్నిహిత వర్గంలో గుర్తింపు పొందిన మాగడి కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం రాత్రి బెంగళూరులోని ప్రైవేట్ హోటల్‌లో కాంగ్రెస్‌కు చెందిన 35 మందికి పైగా ఎమ్మెల్యేలు డిన్నర్ సభలో పాల్గొని రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి సుదీర్ఘ చర్చలు జరిపారు. రాష్ట్రంలోని నాయకత్వ వివాదానికి తెర దింపాలని హైకమాండ్‌కు విన్నవించారు. నాయకత్వ వివాదాలు రాష్ట్రంలో పార్టీ గౌరవానికి భంగం కలిగించటంతో పాటు పరిపాలనపై ప్రభావం చూపుతోంది. ప్రజలకు కూడా తప్పుడు సందేశం వెళుతోంది. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా నాయకత్వ వివాదాలకు తెర దించాలని ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు డిన్నర్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు హైకమాండ్‌కు విన్నవించాలని నిర్ణయించారు.
మంత్రులు కూడా హాజరు
ఈ డిన్నర్ సభలో కాంగ్రెస్‌కు చెందిన 35 మందికి పైగా ఎమ్మెల్యేలు పాల్గొనగా, మంత్రులు డీ.సుధాకర్, మాంకాళ వైద్య కూడా ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు సీ.పీ.యోగేశ్వర్, ఉదయ్‌గౌడ, రవి గణిగ, రమేశ్ బండిసిద్దేగౌడ, ఆనేకల్ శివణ్ణ, కుణిగల్ రంగనాథ్, శిరా ఎమ్మెల్యే టీ.బీ.జయచంద్ర, మూడిగెరె ఎమ్మెల్యే నయన మోటమ్మ, బీడీఏ అధ్యక్షుడు ఎన్.ఏ.హ్యారీస్, బసవరాజ్ శివగంగ, ప్రకాశ్ కోళివాడ, గణేశ్ హుక్కేరి, శరత్ బచ్చేగౌడ, మంథరగౌడ, హొన్నాళి ఎమ్మెల్యే శాంతనగౌడతో పాటు 35 మందికి పైగా ఎమ్మెల్యేలు ఈ డిన్నర్ సభలో పాల్గొన్నారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ ముందు తమ డిమాండ్ పెట్టాలని ఈ ఎమ్మెల్యేలు తీర్మానం తీసుకున్నారు.
మాగడి ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు వేడుక
విందుకు 35 మందికి పైగా
ఎమ్మెల్యేల హాజరు
వీరీలో ఎక్కువ మంది
డీసీఎం డీకేశి వర్గీయులే
సీఎం పదవి అంశంలో అధికార మార్పిడిపై హైకమాండ్ స్థాయిలో ఎలాంటి తీర్మానం జరిగిందో తమకు తెలియదు, ఒకవేళ అధికార మార్పిడి తీర్మానం జరిగి ఉంటే అదే ప్రకారంగా నడుచుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒకవేళ అలాంటి తీర్మానం కాకపోయినా నాయకత్వ మార్పిడి గురించి ఒక స్పష్టమైన తీర్మానం తీసుకొని అన్ని వివాదాలనూ పరిష్కరించాలని హైకమాండ్ నాయకులకు విన్నవించాలని ఈ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత హైకమాండ్ నాయకుల భేటీ సమయం తీసుకొని 8–10 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర కాంగ్రెస్ పరిణామాలు, పరిస్థితి అంతటినీ వారి దృష్టికి తీసుకెళ్లి నాయకత్వ వివాదానికి తెరదించాలని ఒత్తిడి తేవాలని ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు తీర్మానించినట్లు తెలిసింది. ఈ డిన్నర్ సభలో ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ సన్నిహిత వర్గంగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యేలే అధిక సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేకతను సంతరించుకొంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సన్నిహిత వర్గపు ఎమ్మెల్యేలు విదేశీ పర్యటన చేపట్టిన సమయంలోనే డీకే శివకుమార్ వర్గపు ఎమ్మెల్యే పుట్టిన రోజు సాకుతో డిన్నర్ సభ జరపటం కాంగ్రెస్‌లో సంచలనం సృష్టించింది. రాబోయే రోజుల్లో హైకమాండ్ నాయకత్వ మార్పిడికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే అనివార్యతను సృష్టించింది.
నాయకత్వ వివాదానికి తెర దించాలి


