నేటి నుంచి ద్వితీయ పీయూసీ పరీక్షలు
శివాజీనగర: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి ద్వితీయ పీయూసీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 17 వరకు జరిగే పరీక్షలకు 7,10,363 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,217 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగనుంది. పేపర్ లీకేజ్ తదితర వాటికి ఆస్కారం ఇవ్వకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రం చుట్టూ 200 మీటర్లు నిషేధాజ్ఞలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల చుట్టు పక్కల జిరాక్స్, సైబర్ సెంటర్, కంప్యూటర్ సెంటర్లను బంద్ చేయాలని ఆదేశించారు. గత పరీక్షల్లో అక్రమాల్లో పాల్గొన్న వ్యక్తులపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. పరీక్ష జరిగే అన్ని కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తప్పుడు సమాచారం ప్రచారం చేసే సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచేందుకు పోలీస్‌శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లాలో డీసీలు, ఎస్పీలు పర్యవేక్షణ చేయనున్నారు. భారీ బందోబస్తు మధ్య ట్రెజరీ నుంచి ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించనున్నారు. ఈ సమయంలో వీడియో చిత్రీకరణ చేస్తారు. నిర్ధారించిన సమయం కంటే ముందుగానే ప్రశ్నపత్రాన్ని ఓపెన్ చేయరాదు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను నిషేధించారు. వాచీతోపాటుగా ఇతర పరికరాలను నిషేధించారు. ప్రతి కేంద్రంలో సిట్టింగ్ స్క్యాడ్ ఏర్పాటు చేశారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం
1 గంట వరకు పరీక్ష
హాజరు కానున్న 7,10,363 మంది
విద్యార్థులు
ప్రతి కేంద్రంలోనూ సీసీకెమెరాలు
పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు


