కర్ణాటక డిజిటల్ రాజధాని కావాలి
● సీఎం సిద్దరామయ్య
శివాజీనగర: కర్ణాటకను భారతదేశంలో సిలికాన్ సిటీ వ్యాలీగా పరిగణించటమే కాకుండా డిజిటల్ ప్రపంచ సృజనశీల రాజధానిగా పిలిచేటట్లు కావాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. శుక్రవారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన జీఏఎఫ్‌ఎక్స్ ఏడో ఆవృత్తి ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. బెంగళూరు కేవలం భారతదేశ సాంకేతిక పరిజ్ఞాన రాజధాని కాదు. సృజనశీలతను కనిపెట్టే స్థలం. సాఫ్ట్‌వేర్ నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు బయోటెక్ నుంచి డీప్‌టెక్ వరకు బెంగళూరు ఎప్పటికీ కూడా విప్లవాల బాటలో నిలిచిందన్నారు. గేమ్స్, ఆనిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ రంగం ఇకపై చిన్న సృజనశీల రంగం కాదు. డిజిటల్ విప్లవంలో తలమునకలయ్యే మాధ్యమం. స్ట్రీమింగ్ ప్రొఫార్మాలు, ఈ–స్పోర్ట్స్, విస్తృత వాస్తవ యుగంలో జీఏఎఫ్‌ఎక్స్ మానవత్వ కథలు, సంస్కృతి, విద్య, పరిపాలనను ఎలా అనుభవిస్తుంది అనేదాన్ని రూపొందిస్తుందని తెలిపారు. కర్ణాటక యువకులు కేవలం ఉద్యోగాకాంక్షులు కాదు, వారు ప్రపంచాల సృష్టికర్తలు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం ఉన్న ఈ రంగపు విన్యాసం, కోడింగ్, కథ చెప్పటం, సంగీతం, మోషన్ క్యాప్టర్, ఏఐ మాడలింగ్, ఉత్పత్తి నిర్వహణ వ్యాప్తంగా ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇది కళ, గణితం, మనోవిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు.
వ్యవసాయానికి పగలే
ఏడు గంటల విద్యుత్
సాక్షి బెంగళూరు: వ్యవసాయ పంప్‌సెట్లకు పగటిపూట ఏడు గంటల నిరంతరాయ విద్యుత్‌ను ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్ తెలిపారు. శుక్రవారం కేపీసీసీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, ఇతరుల విజ్ఞప్తులు స్వీకరించిన అనంతరం జార్జ్ మాట్లాడుతూ ‘కుసుమ్–సీ’ ప్రాజెక్టు ద్వారా సాగుకు విద్యుత్ అందించేందుకు ఉపకేంద్రాలను నిర్మించి 2500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే లక్ష్యంతోముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పగటిపూట రైతులకు ఏడు గంటల విద్యుత్‌ను అందిస్తామన్నారు. దేశంలో అత్యధికంగా 80 శాతం సబ్సిడీతో కుసుమ్–బీ ప్రాజెక్టు కింద సోలార్ పంప్‌సెట్లను అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే గృహజ్యోతి పథకం ద్వారా 1.65 కోట్ల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు వెల్లడించారు. సౌరశక్తిని వ్యవసాయ కార్యకలాపాలకు అనుసంధానం చేస్తే విద్యుత్ కన్వర్టర్లపై ఒత్తిడితోపాటు విద్యుత్ చోరీని తగ్గించవచ్చునని తెలిపారు.
బిడ్డ ఉపనామంలో
తల్లి పేరు చేర్చండి
● అయినా తండ్రి హక్కును కోల్పోరు
● హైకోర్టు సంచలన తీర్పు వెల్లడి
శివాజీనగర: లివ్–ఇన్ రిలేషన్(వివాహం చేసుకోకుండా పురుషుడు, మహిళ కలిసి జీవించడం) సంబంధంతో జన్మించిన బిడ్డ ఉపనామంలో తల్లి వంశావళిని గుర్తించిన హైకోర్టు ఎనిమిదేళ్ల బాలిక పేరును తండ్రి కాకుండా తల్లి కుటుంబంతో చేర్చాలని జనన, మరణాల నమోదు శాఖను ఆదేశించింది. జనన ధృవీకరణ పత్రంలో బిడ్డ ఉపనామాన్ని మార్చాలని సమర్పించిన విన్నపాన్ని ఎలాంటి కారణం చూపకుండా తిరస్కరించిన జనన, మరణ నమోదు శాఖ అధికారుల చర్యను ప్రశ్నిస్తూ బిడ్డ పేరుపై తల్లి ఒకరు సమర్పించిన పిటిషన్ విచారణ జరిపిన న్యాయమూర్తి సూరజ్ గోవిందరాజ్‌తో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా జనన ధృవీకరణ పత్రంలో జైవిక తండ్రి పేరును పెట్టుకోవచ్చని ధర్మాసనం వెల్లడించింది.


