హంపీలో నటుడు జగ్గేష్ పర్యటన
హొసపేటె: ప్రముఖ కన్నడ సినీ హాస్యనటుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జగ్గేష్ ప్రపంచ ప్రఖ్యాత హంపీలో పర్యటించారు. అక్కడి యంత్రోద్ధారక హనుమాన్ ఆలయాన్ని గురువారం సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంపీలో గురు రాయర గురువు శ్రీవ్యాస రాయరు తపస్సు చేసి ధ్యానం చేసిన పవిత్ర స్థలాన్ని కూడా సందర్శించానన్నారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రదేశంలో కొంతసేపు ధ్యానం చేసి దేవుని అనుగ్రహాన్ని కోరుకున్నానన్నారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు. హంపీ చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలుసుకున్న జగ్గేష్ ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించడం ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుందని అన్నారు.


