చిక్కమగళూరు జిల్లా బంద్
యశవంతపుర: కాఫీ తోటలో అడవి ఏనుగు దాడిలో మహిళా కూలీ చనిపోగా, ఆమె మృతదేహంతో కూలీలు రహదారిపై ధర్నా చేయడం, పోలీసులు లాఠీచార్జీ జరపడం తెలిసిందే. లాఠీ దాడిని ఖండిస్తూ సోమవారం చిక్కమగళూరు జిల్లాలో బంద్ జరిగింది. ఉద్రిక్తత పరిస్థితుల మధ్య బంద్ జరిగింది. శృంగేరి, కొప్ప, ఎన్‌ఆర్‌పుర తాలూకాల వ్యాప్తిలో కాఫీ తోటల రైతులు, కూలీలు బంద్ జరిపారు. వాహనాల సంచారం నిలిచి పోయింది. కడబగెరెలో బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. అంగళ్లు, ఆఫీసులను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు మద్దతు పలికారు. ప్రతిపక్ష పార్టీలు, కూలీలు, వివిధ సంఘాల నాయకులు ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేగౌడకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత్యంతరం లేక లాఠీచార్జీ చేసినట్లు ఎస్పీ జితేంద్రకుమార్ దయామ్ తెలిపారు. ఈ గొడవలో పోలీసులు కూడా గాయపడినట్లు తెలిపారు.
పోలీసుల లాఠీచార్జీపై జనం ఖండన


