వివాహిత ఆత్మహత్య.. పోలీసుపై కేసు
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని భద్రావతిలోని హొస సిద్ధాపురలో స్వాతి (27) అనే వివాహిత ఆత్మహత్య కేసులో స్థానిక మాలూరు హెడ్ కానిస్టేబుల్ మోహన్‌పై కేసు దాఖలైంది. ప్రభుత్వ క్లర్కు అయిన ఆమె భర్త జగదీష్ శివరాత్రి రోజున ఉరివేసుకుని చనిపోయాడు. దీనికి కారణం స్వాతి అని మోహన్ తప్పుడు ప్రచారం చేసి, ఆమెను మానసికంగా వేధించాడని, అందువల్ల ప్రాణాలు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి. స్వాతి తల్లి భద్రావతి న్యూటౌన్ ఠాణాలో ఫిర్యాదు చేయగా జిల్లా ఎస్పీ నిఖిల్ ఆదేశాలతో నిందితునిపై కేసు నమోదు చేశారు. కేసులో నిజాన్ని బయటకు తీసుకురావడానికి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాము, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎమ్మెల్యే చంద్రుపై స్వామీజీ గుస్సా
శివాజీనగర: కాంట్రాక్టర్ నుంచి గదగ్ జిల్లా శిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లామాణి రూ.5 లక్షలు లంచం తీసుకున్న కేసులో ఆయన జైలుపాలు కావడం తెలిసిందే. ఓ స్వామీజీ ఆ ఎమ్మెల్యే గురించి మాట్లాడిన ఫోన్ కాల్ బయటకు వచ్చింది. శిరహట్టి తాలూకా అదరహళ్లి కుమార మహారాజ స్వామీజీ, బీజేపీ కార్యకర్త ఒకరు 2.36 నిమిషాల పాటు మాట్లాడిన ఆడియో లీకై ంది. ఎమ్మెల్యే మీద ఆయన ఆగ్రహంగా మాట్లాడారు. దీనిపై స్వామీజీ స్పందిస్తూ, ఆ ఆడియో నాదే, 6 నెలల క్రితం మాట్లాడాను, చంద్రుకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నాను అని తెలిపారు. అయితే లోకాయుక్త దాడికి, తనకు సంబంధం లేదని అన్నారు. తనను గ్రామం నుంచి పారద్రోలేందుకు ఎమ్మెల్యే కుట్ర చేశారని ఆరోపించారు.
కరెంటు స్తంభానికి స్కూలు బస్సు ఢీ
దొడ్డబళ్లాపురం: బ్రేక్ ఫెయిల్ అయిన కారణంగా స్కూల్ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటన నగరంలో మహాలక్ష్మిలేఔట్ పరిధిలో జరిగింది. బస్సులో ఉన్న సుమారు 10 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సోమవారం ఉదయం ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు పిల్లలను తీసుకుని వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపక్కన ఉండే కరెంటు స్తంభాన్ని ఢీకొనింది. పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు.
స్నేహమయి, మైలారప్పపై మహిళ కేసు
బనశంకరి: మైసూరు ముడా కేసు ఫిర్యాదిదారు, సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ, మరొకరిపై బెంగళూరు బసవేశ్వరనగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. లేఖ ద్వారా హత్యా బెదిరింపులకు పాల్పడ్డాడని పవిత్ర అనే మహిళ ఫిర్యాదు చేయగా, స్నేహమయికృష్ణ, బెంగళూరు వర్శిటీ ప్రొఫెసర్ మైలారప్ప పై కేసు నమోదైంది. వివరాలు.. పవిత్ర 2022లో బెంగళూరు యూనివర్శిటీలో డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ బీసీ.మైలారప్ప నిర్వహిస్తున్న కర్ణాటక రాష్ట్ర హరిజన సేవక సంఘంలో చేరారు. రెండేళ్లు పనిచేసే మానేశారు. కానీ 2024 చివరిలో పవిత్ర భర్త ఆకస్మాత్తుగా చనిపోయాడు. పవిత్ర మీద అనుమానంతో మృతుని తల్లి మహాలక్ష్మీ లేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. మరోవైపు ఆస్తి రాబట్టుకునేందుకు ఆమె న్యాయవాదిని కలవగా, మైలారప్ప జోక్యం చేసుకుని ఇబ్బంది పెడుతున్నాడని గతంలో పవిత్ర బసవేశ్వరనగర ఠాణాలో ఫిర్యాదుచేసింది. కానీ గత ఏడాది డిసెంబరు 5 తేదీన తనకు లేఖ రాసిన స్నేహమయికృష్ణ, మైలారప్ప పై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించాడని పవిత్ర ఆరోపించింది. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఒకే కాన్పులో ముగ్గురు జననం
మైసూరు: మైసూరు నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక గర్భిణి మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మండ్యలోని కె.ఆర్.పేట్ తాలూకాలోని అక్కిహెబ్బళ గ్రామానికి చెందిన ఆరిఫా బానుకు నెలలు నిండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం సాయంంత్రం వైద్యులు సిజేరియన్ చేయగా, ఒక ఆడపిల్ల, ఇద్దరు మగపిల్లలు పుట్టారు. తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. వారి బంధువుల సంతోషానికి హద్దుల్లేవు.
సైరన్ మోత.. దొంగ పరారీ
యశవంతపుర: బ్యాంక్‌ను దోపిడీకీ దొంగ విఫలయత్నం చేశాడు. బెంగళూరు శేషాద్రిపురంలోని కెనరా బ్యాంక్‌కు కన్నం వేయడానికి యత్నించిన దొంగ సైరన్ మోగడంతో పారిపోయాడు. ఆదివారం అర్ధరాత్రి ఓ దొంగ బ్యాంక్ ఆవరణలో కలియతిరిగాడు, లోపలికి చొరబడి స్ట్రాంగ్‌రూం తాళాలను కట్ చేసే ప్రయత్నంలో ఉండగా, సైరన్ గట్టిగా చప్పుడు చేసింది. దీంతో దొంగ కాలికి బుద్ధి చెప్పాడు, ఈ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు దొంగ కోసం విచారణ చేపట్టారు.
వీధిపాలైన శిశువు
తుమకూరు: ఆ కన్నతల్లిది ఎంతటి రాతి హృదయమో కానీ.. పసికందును రోడ్డున పడేసింది. జిల్లాలోని కుణిగల్ తాలూకాలోని యడియూర్ ఆలయం వద్ద దాసోహ భవన్ రోడ్డు పక్కన ఒక సంచిలో నవజాత శిశువు ఉంది. శిశువు ఏడుపు విని స్థానికులు అక్కున చేర్చుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువును కుణిగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆరోగ్యంగా ఉందని, పుట్టి నాలుగైదు రోజులు అయి ఉంటుందని తెలిపారు. ఆసుపత్రిలోని సఖి కేంద్రంలో నర్సుల సంరక్షణలో ఉంచారు. తల్లిదండ్రులు ఎవరనేది పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


