సిద్దు, శివ.. సఖ్యత కరువా?
బనశంకరి: ఉత్తర కన్నడ జిల్లా కార్వారలో ఆదివారం 450 పడకల మల్టీస్పెషాలిటి ఆస్పత్రి– వైద్య కళాశాలకు భూమిపూజ, గంగావళి వంతెన ప్రారంభోత్సవంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ పాల్గొన్నారు కానీ, ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. మాట్లాడుకోకుండా మౌనం వహించారు. దీంతో ఇద్దరి మధ్య కుర్చీ గొడవ విభేదాలు తారాస్థాయికి చేరినట్లు అందరూ భావిస్తున్నారు. కార్యక్రమం సుమారు గంటపైగా జరిగితే వేదిక మీద, రిబ్బన్ కటింగ్‌లోనూ సీఎం, డీసీఎంలు ఒకరి ముఖం ఒకరు చూసుకోకపోవడం ప్రజలు, కార్యకర్తల్లో ఆశ్చర్యం కలిగించింది. సీఎం సిద్దరామయ్య ఫైళ్లను చూస్తూ ఉంటే, శివకుమార్ మొబైల్‌లో నిమగ్నమయ్యారు. మంత్రులు పలకరించినప్పటికీ స్పందించలేదు. నేను పోరాటాన్ని వీడేది లేదని, నేను సీఎంగా ఉండడం కొందరికి నచ్చడం లేదని సిద్దరామయ్య ఇటీవల ప్రకటన చేయడం తెలిసిందే.
ఢిల్లీకి నేను కాక ఎవరెళ్తారు?: డీసీఎం
శివాజీనగర: నేను ఢిల్లీకి వెళ్తాను, వస్తాను, నేను కాకుండా మరెవరు వెళతారు?, వారు ఎప్పుడు పిలుస్తారో అప్పుడు వెళ్లాలి అని డీసీఎం డీ.కే.శివ కుమార్ అన్నారు. బెంగళూరులో సదాశివనగర ఇంటివద్ద విలేకరులతో మాట్లాడారు. అసోం పర్యటనలో ప్రియాంక గాంధీతో రాష్ట్ర రాజకీయాలపై చర్చించారా అని అడగగా, అది బయటకు చెప్పే విషయం కాదన్నారు. అమెరికాతో పన్ను ఒప్పందం వల్ల దేశంలో ప్రతి రైతుపై వ్యతిరేక ప్రభావం పడుతుందన్నారు. తాను, సీఎం కార్వారలో వైద్యవిద్యా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. సోమవారం కోలారు, చిక్కబళ్లాపురలో మనరేగ పరిరక్షణ సభలను జరుపుతామన్నారు. పార్టీ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరుకు వస్తున్నారని, పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఆ సమావేశంలో పాల్గొనాలని అన్నారు. కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, హోంమంత్రి పరమేశ్వర్ భేటీ అయ్యారని విలేకరులు ప్రస్తావించగా, పరమేశ్వర్ నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపనకు అయి ఉంటుందని అన్నారు.
పలకరించుకోని సర్కారు సారథులు
తారాస్థాయికి విభేదాల సెగ?
కార్వార కార్యక్రమంలో బట్టబయలు
సీఎం, డీసీఎంల మధ్య పీఠం తగాదా తీవ్రరూపం దాల్చినట్లే ఉంది. ఎంత గొడవ ఉన్నా బయట కార్యక్రమాల్లో పలకరించుకుంటూ అంతా బాగుందనే ఫీలింగ్ చూపేవారు. కానీ ఇప్పుడది పటా పంచలైనట్లు కనిపిస్తోంది. గంటసేపు
ఒకే కార్యక్రమంలో పాల్గొన్న సిద్దరామయ్య, శివకుమార్‌లు కనీసం ముఖం ముఖం చూసుకోలేదు.
ఎమ్మెల్యేలూ.. నోరు మూసుకుంటారా: డీసీఎం
బనశంకరి: సిద్దరామయ్య వర్గం ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు వెళ్లడంపై డీసీఎం వర్గం ఎమ్మెల్యేలు రవి గాణిగ, బసవరాజ్ శివగంగ, ఇక్బాల్ హుసేన్ విమర్శలు గుప్పించడంతో పార్టీలో వేడి పెరుగుతోంది. దీనిపై కార్వారలో డీసీఎం డీకే.శివకుమార్ సమాధానమిస్తూ ఎమ్మెల్యేలు నోరుమూసుకుని ఉండాలని హెచ్చరించారు. ఆ ముగ్గురూ నోటికి తాళం వేయాలని సూచించారు. విదేశాలకు వెళ్లినవారు వెళ్లనీయండి, ఎందుకు వెళ్లారు అనేది వాళ్లు తిరిగి వచ్చాక అడుగుతాను అని తెలిపారు. తమలో ఎలాంటి గందరగోళం లేదని, కొందరు నోరుమూసుకుని ఉంటే అందరికీ మంచిదన్నారు.


