మళ్లీ చెలరేగిన స్నేహమయి
● ప్రమోషన్‌కు లంచం నిజం
బనశంకరి: ముడా మాజీ కమిషనర్ నటేశ్ కు పదోన్నతి కోసం కోట్ల రూపాయల లంచం వెళ్లిందని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలినీ రజనీశ్ పేరును ప్రస్తావించి అరెస్టయి, విడుదలైన ప్రముఖ సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ మళ్లీ మాట మార్చాడు. శాలినీ మీద అబద్ధపు ఆరోపణలు చేశానని అతడు శనివారం ప్రకటించడం తెలిసిందే. ఆదివారం ఫేస్‌బుక్‌లో మరో పోస్టు పెట్టాడు, నటేశ్‌కు పదోన్నతి గురించి ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పేది లేదన్నాడు. శాలినీ రజనీశ్ పేరును ప్రస్తావించినందుకు మాత్రమే క్షమాపణ అడిగానని అన్నాడు. ఈ కేసులో సాక్ష్యాధారాలను ఇచ్చిన వినోద్ మాట తప్పాడన్నారు. ప్రముఖ వ్యక్తికి లంచం ఇచ్చింది నిజం, ఆధారాలున్నాయి, దర్యాప్తు చేపడితే ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు అనేది తెలుస్తుందన్నారు. మైసూరు ముడాలో 14 స్థలాలు చట్టబద్ధంగా తీసుకున్నానని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం సిద్దరామయ్య నేను ఫిర్యాదు చేయగానే, తప్పు ఒప్పుకుని 14 సైట్లను వెనక్కి ఇచ్చారని తెలిపాడు. కాబట్టి నేను పెద్ద తప్పు చేయలేదన్నారు.
తల్లయిన బాలిక.. కామాంధునికి 20 ఏళ్ల జైలు
మైసూరు: బాలికపై లైంగిక దాడికి పాల్పడగా, బాలిక గర్భం దాల్చి తల్లయింది, ఈ కేసులో ముద్దాయికి న్యాయాలయం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలు.. మైసూరు ఇలవాలలో నిందితుడు గురుమూర్తి ఓ బాలికను ప్రేమ పేరుతో మభ్యపెట్టాడు. 2023 మార్చిలో ఆమె ఇంటికి వెళ్లి, ఆమెను ప్రలోభపెట్టి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా, ఆమె గర్భవతి అయి, మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సీఐ శివనంజశెట్టి దర్యాప్తు చేసి కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. న్యాయమూర్తి ఆనంద్ పి. హోగాడే విచారిస్తున్నారు. శనివారం తుది విచారణలో నేరం రుజువు కావడంతో కామాంధుడు గురుమూర్తికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఆ డబ్బును ఆ బాలికకు చెల్లించాలని, ఆమెకు ప్రభుత్వం రూ.6 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు. న్యాయవాది కె.బి. జయంతి ప్రభుత్వం తరపున వాదించారు.
లంచం కేసులో చెరసాలకు ఎమ్మెల్యే చంద్రు
శివాజీనగర: కాంట్రాక్టర్ నుంచి రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్తకు చిక్కిన గదగ్ జిల్లా శిరహట్టి బీజేపీ ఎమ్మెల్యే చంద్రు లమాణికి మార్చి 2 వరకు జ్యుడిషియల్ కస్టడీకి బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆదేశించింది. ఆదివారం యలహంక జ్యుడిషియల్ లేఔట్‌లోని జడ్జి ఇంటిలో ఎమ్మెల్యేను లోకాయుక్త పోలీసులు హాజరుపరిచి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. ఇద్దరు పీఏలు మంజునాథ్, గురు లమాణికి కూడా కస్టడీకి అనుమతించారు. ఎమ్మెల్యే, కాంట్రాక్టర్ మధ్య లంచం కాల్స్ ఆడియోను లోకాయుక్త పోలీసులు సీజ్ చేసినట్లు తెలిసింది. తన నియోజకవర్గంలో చేసే పనుల్లో ముడుపులు ఇవ్వకుంటే బాగుండదని ఎమ్మెల్యే హెచ్చరించినట్లు కాంట్రాక్టరు ఆరోపించాడు.
సామూహిక
సత్యనారాయణ వ్రతం
శ్రీనివాసపురం: పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆదివారం వాసవి లలిత సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు సుబ్రమణిస్వామి నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరిగాయి.


