మెట్రో హైడ్రామా
బనశంకరి/ శివాజీనగర: బెంగళూరు నమ్మ మెట్రో రైలు టికెట్ చార్జీల గందరగోళం ఆదివారం కూడా కొనసాగింది. బీఎంఆర్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ చార్జీల పెంపును నిలిపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఉత్తర్వులు రాలేదని, కాబట్టి చార్జీల పెంపు సోమవారం నుంచి కొనసాగుతుందని చెప్పారు. ఒకవేళ అత్యవసర ఆదేశాలు వస్తే పాటిస్తామన్నారు. ధరల పెంపు వల్ల ధర్నాలు జరగవచ్చనే ఆలోచనలతో 9వ తేదీ నుంచి మెట్రో స్టేషన్‌లలో భద్రత కల్పించాలని అధికారులు నగర పోలీసులకు లేఖ రాశారు.
మునుముందైనా బాదుడే
ఆదివారం రాత్రి మళ్లీ చార్జీల పెంపును నిలిపివేసినట్లు మెట్రో అధికారులు తెలిపారు. సోమవారం పాత చార్జీలే కొనసాగుతాయని పత్రికా ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పుడు చార్జీలను పెంచకపోయినా, మార్చిలో గాని ఏప్రిల్‌లో మాత్రం బాదుడు తప్పదని తెలుస్తోంది. ఆ పెంపు 100 శాతం ఉన్నా ఆశ్చర్యం వద్దని మెట్రో వర్గాలు చెప్పడం విశేషం.
ఎంపీ తేజస్వి హల్‌చల్
ముఖ్యమంత్రి గారూ, నాటకాలు ఆపండి (మెట్రో టికెట్ రేట్లు పెంచకండి) అని రాసిన టీషర్ట్ ధరించి బెంగళూరు దక్షిణ ఎంపీ తేజస్విసూర్య ఆదివారం నగరంలోని ఆర్‌వీ రోడ్డు మెట్రోస్టేషన్‌లో హల్‌చల్ చేశారు. ప్రయాణికులతో చర్చ జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే చార్జీలు పెరుగుతున్నాయన్నారు. 5 శాతం టికెట్ రేట్ల పెంపుతో ఒక్కో ప్రయాణికునిపై రూ.250 భారం పడుతుందన్నారు. తాము కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ఖట్టర్‌కు వివరించగా, తాత్కాలికంగా నిలిపివేయాలని బీఎంఆర్‌సీఎల్‌ను ఆదేశించారని తెలిపారు.
చార్జీల పెంపు కచ్చితమన్న ఎండీ
నిలిపేసినట్లు మళ్లీ ప్రకటన
నేడు పాత టికెట్ రేట్లే


