ఇసుక అక్రమ రవాణాపై నిఘా
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో క్రిష్ణ, తుంగభద్ర నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలింపుపై నిఘా పెట్టాలని జిల్లాధికారి నితీష్ సూచించారు. శుక్రవారం జిల్లాధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ, గనులు, భూగర్భ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, జిల్లా ఎస్పీ అరుణాంగుష్ గిరి, డీఎస్పీ శాంతవీర, ఏసీలు బసవణ్ణప్ప, హంపణ్ణ తదితరులు పాల్గొన్నారు.


