కరుణించు.. మైలార లింగేశ్వరా
సాక్షి, బళ్లారి: ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హువినహడగలి తాలూకా మైలారంలో వెలసిన ఏళుకోటి మైలార లింగేశ్వరుడు భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. ఈనెల 25వ తేదీన (రథ సప్తమి రోజున) ఏళుకోటి మైలార లింగేశ్వర జాతర ప్రారంభమైంది. ఫిబ్రవరి 4వ తేదీ వరకు అంటే 11 రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉత్సవాల్లో భాగంగా మైలార లింగేశ్వర విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేసి, దేవాలయ మంటపంలో ఆవు పాలను పొంగించారు. ఆవు పాలు ఉత్తర దిక్కుకు పొర్లడంతో ఆ ప్రాంతంలో మంచి పంటలు సమృద్ధిగా పండుతాయని అర్చకులు చెబుతున్నారు. జాతరలో ప్రధానంగా ఫిబ్రవరి 4వ తేదీన కార్ణికోత్సవం నిర్వహిస్తారు. కార్ణికం (దైవవాక్కు) చెప్పే గొరవయ్య రామణ్ణ 11 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. కార్ణికం అంటే ఏడాది పొడవునా జరిగే సంఘటనలను విల్లు ఎక్కి గొరవయ్య చెప్పడం. కర్ణాటకతో పాటు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహరాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు కార్ణికోత్సవానికి విచ్చేస్తుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏళుకోటి మైలార లింగేశ్వర స్వామి జాతరలో ప్రధానంగా జాతర ప్రారంభం రోజున పాలు పొంగించడం, కార్ణికోత్సవం ఘట్టాలకు ఘన చరిత్ర ఉందని అర్చకులు చెబుతున్నారు.
గ్రామాల్లో పండుగ వాతావరణం
సాక్షాత్తూ పరమేశ్వరుడు మైలారలో మైలార లింగేశ్వర స్వామిగా అవతరించి దర్శనం ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏళుకోటి మైలార లింగేశ్వర స్వామి జాతర జరిగే 11 రోజులు గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మైలార చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు జాతరకు ఎద్దుల బండ్లలో భారీగా తరలివస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచే కాకుండా రాష్ట్రం, దేశంలో సంభవించే ప్రధాన అంశాలు, ప్రజల జీవనం ఎలా ఉంటుంది అనే విషయాలపై ఒకే ఒక్క వాక్యంలో కార్ణికం చెప్పడం విశేషం. కాగా.. ఏళుకోటి మైలార లింగేశ్వర స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకునే భక్తుల సంఖ్య ఏటేటా క్రమంగా పెరుగుతోంది.
భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న జాతర
ఫిబ్రవరి 4న కార్ణికోత్సవం
తరలివస్తున్న భక్తజన సందోహం
11 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు
చేయనున్న గొరవయ్య రావణ్ణ
కరుణించు.. మైలార లింగేశ్వరా
కరుణించు.. మైలార లింగేశ్వరా
కరుణించు.. మైలార లింగేశ్వరా


