అలసంద పంటకు నిప్పు
హొసపేటె: తాలూకాలోని హొళగుంది గ్రామంలో రైతు మెల్లి హాలప్ప పొలంలో కోతలు కోసి నిల్వ చేసిన అలసంద పంటకు గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా పంట మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటనలో రైతుకు రూ.1.40 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం.
7న గాంధీ జీవితంపై వక్త్తృత్వ పోటీలు
హుబ్లీ: స్థానిక ఉనకల్ సాయి నగర్ రోడ్డు చిక్కమఠ ప్రభుత్వ పాఠశాలలో ఫిబ్రవరి 7వ తేదీన మహాత్మా గాంధీ జీవితంపై విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని సాయినగర్ రోడ్డు దాతల మిత్రబృందం కన్వీనర్ కాంతేష శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కో పాఠశాల నుంచి గరిష్టంగా ఇద్దరు పాల్గొనవచ్చని వెల్లడించారు. మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కన్నడ, ఇంగ్లిష్, హిందీల్లో ప్రసంగించవచ్చని పేర్కొన్నారు. విజేతలకు రూ.2 వేలు, రూ.1000, రూ.500 చొప్పున నగదు బహుమతులు, లేఖన సామగ్రి అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఫిబ్రవరి 5వ తేదీలోపు పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9035317151 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
గడ్డివాము దగ్ధం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా రంగనహళ్లి గ్రామంలో రైతు రామన్నకు చెందిన గడ్డివాముకు ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకోవడంతో దగ్ధమైన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. రామన్న పశువుల మేత కోసం గడ్డిని వామిగా వేసుకున్నాడు. గురువారం రాత్రి గడ్డివామికి నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన గ్రామానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కనహోసల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదాల నియంత్రణకు సహకరించాలి
రాయచూరు రూరల్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మారుతి బగాదే పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా న్యాయాలయం వద్ద మిహిళలకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ప్రయాణించే సమయంలో కుడి, ఎడమ వైపు చూస్తూ రహదారి నియమాలను పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు.కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతిక్, పీపీ శివశంకర్, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు.
‘స్వయం సహాయక
సంఘాల ప్రమేయం వద్దు’
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వయం సహాయక సంఘాల ప్రమేయం వద్దు అని సీఐటీయూ నాయకురాళ్లు డిమాండ్ చేశారు. శుక్రవారం టిప్పు సుల్తాన్ ఉద్యానవనంలో మధ్యాహ్న భోజన కార్మికులతో కలసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన విషయంలో కూరగాయలు, గుడ్లు, అరటి పండ్లు సరఫరాను రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే పద్ధతిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక అధికారికి వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో మరియమ్మ, రేణుకమ్మ, శరణబసవ, అక్క మహాదేవి, శోభ, శరణమ్మ, కళ్యాణమ్మ, పద్మబసమ్మ, మల్లమ్మ, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
అలసంద పంటకు నిప్పు
అలసంద పంటకు నిప్పు
అలసంద పంటకు నిప్పు


