ట్రాఫిక్ చలానా.. మరో సైబర్ వంచన
● అపరిచితులు పంపే ఎలాంటి మెసేజ్, లింక్, క్యూ ఆర్ కోడ్ లేదా ఏపీకే ఫైల్‌కు స్పందించరాదు. వాటిని నొక్కితే ప్రమాదం తప్పదు
● ఏవైనా గానీ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్‌స్టోర్ తో పాటు ఇతర అధికారిక మార్గాల్లోనే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
● ఏ లింకులోనూ వ్యక్తిగత సమాచారం, బ్యాంకులు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను తెలియజేయరాదు.
బనశంకరి: రూ.500 ట్రాఫిక్ చలానా చెల్లించే ప్రయత్నంలో ఓ టెక్కీ రూ.2.32 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు బెంగళూరు వైట్‌ఫీల్డ్ సైబర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వివరాలు... బాధితుని మొబైల్‌కు ఈ నెల 26వ తేదీ ఓ మెసేజ్ వచ్చింది, మీ వాహనం మీద ట్రాఫిక్ జరిమానా రూ.500 ఉంది, దానిని ఈ లింకు ద్వారా చెల్లించాలని సూచించారు. నిజమని నమ్మిన టెక్కీ తన క్రెడిట్‌కార్డు నంబరు, సీవీవీ తదితరాలను నమోదుచేసి చెల్లించగా ఏకంగా రూ.2.32 లక్షలు కట్ అయ్యింది. దీంతో లబోదిబోమంటూ ఫిర్యాదు చేశాడు.
చలానాలు ఇలా చెల్లించండి
వాహన యజమానులు బీటీపీ అస్త్రం, కర్ణాటక రాష్ట్ర పోలీస్ (కేఎస్‌పీ) యాప్, బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ లేదా కర్ణాటక వన్ వెబ్‌సైట్‌లో చలానాలు, జరిమానాలను చెల్లించవచ్చు. లేదా ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లు, ఇన్‌ఫ్యాంట్రి రోడ్డులోని ట్రాఫిక్ కేంద్రానికి నేరుగా వెళ్లి కట్టవచ్చు. మెసేజ్‌లను నమ్మి మోసగాళ్ల వలలో పడరాదని పోలీసులు తెలిపారు.
టెక్కీకి నకిలీ లింక్‌ను పంపిన మోసగాళ్లు
రూ.500 చెల్లించబోతే రూ.2.32 లక్షలు కట్
సిలికాన్ సిటీలో కొత్త రకం చీటింగ్స్
ఆ స్కూటరుపై రూ.2.13 లక్షల చలానాలు
యశవంతపుర: బెంగళూరులో ఓ స్కూటర్‌పై ఏకంగా రూ.2.13 లక్షల జరిమానాలు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బైకు యజమాని మొహమ్మద్ ముజామిల్ ఫైజల్, ఇదెలా బయటపడిందంటే.. ఆదివారం రాత్రి అతడు ఫ్రేజర్ టౌన్‌లోని లోకా మోకా కేఫ్‌కు వెళ్లాడు. పక్క టేబుల్‌లో కూర్చున్న మహిళ మీదకు సిగరెట్ పొగ వదిలి, అనుచితంగా ప్రవర్తించాడు. కేఫ్ సిబ్బంది అలా చేయవద్దని చెబితే వారిని దూషించి, బయటకు రా, చూసుకుందామని బెదిరించాడు. దీంతో కేఫ్ యజమాని నేత్రావతి పులకేశినగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు వచ్చిన పోలీసులు అతనిని పట్టుకుని స్కూటర్‌ను పరిశీలించారు. దానిపై రూ.2.13 లక్షల చలానాలు ఉన్నట్లు గుర్తించారు. లెక్కలేనన్నిసార్లు ట్రాఫిక్ నియమాలను అతిక్రమించినట్లు తేలింది. నిందితుడు హలసూరులోని బ్యాంక్ ఆఫ్ ఆమెరికా బ్రాంచిలో హెచ్‌ఆర్ ఉద్యోగి అని తెలిసింది. అతనికి నోటీసులు జారీచేసి స్కూటర్‌ని సీజ్ చేశారు.
కనీస జాగ్రత్తలు
పాటించాలి
ట్రాఫిక్ చలానా.. మరో సైబర్ వంచన


