పంచాయతీల ఎన్నికలకు ఏర్పాట్లు
శివాజీనగర: గ్రామ పంచాయితీల ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే గడువు ముగిసిన గ్రామ పంచాయితీలకు ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. కాలావధి పూర్తయిన టీపీలు, జీపీలకు 2025 డిసెంబర్ నెలలో ఎన్నికలను జరపాల్సి ఉంది. కానీ పనులు సాగక వాయిదా పడుతున్నాయి. ఓటర్ల జాబితా ముద్రించారు. ఇతరత్రా ఏర్పాట్లను అధికారులు, ఎన్నికల కమిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గడువులోగా అభ్యర్థుల రిజర్వేషన్ పట్టీలను తయారు చేసి, వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని సర్కారు జిల్లా అధికారులను ఆదేశించింది. దీంతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం అంబరమంటే అవకాశం ఉంది.
బాలికపై లైంగిక దాడి
పావగడ: తుమకూరు జిల్లా పావగడ తాలూకా అరసికెరె పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డేనహళ్ళిలో ఘోరం జరిగింది. తొమ్మిదేళ్ళ బాలిక మీద మను అనే కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన గురువారం జరిగింది. రూరల్ సీఐ గిరీశ్ తెలిపిన వివరాల మేరకు 4వ తరగతి చదువుతున్న బాలిక మధ్యాహ్నం భోజన సమయంలో పాఠశాలలోనే ఉండి పోయింది. ఆ సమయంలో మను అనే వ్యక్తి ఆ విద్యార్థినికి మాయమాటలు చెప్పి తన ఇంటికి పిలుచుకెళ్లి అత్యాచారం జరిపాడు. బాలిక గట్టిగా ఏడుస్తుండడంతో పాఠశాల టీచర్ పరుగున వెళ్లి చూసి నివ్వెరపోయింది. బాలిక తల్లి అరసికెరె పోలీసులకు ఫిర్యాదు చేయగా మనుని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
నకిలీ బంగారు నగలతో
రూ.56 లక్షల రుణం
మైసూరు: బ్యాంకు అప్రైజర్‌కు లంచమిచ్చి, నకిలీ బంగారు ఆభరణాలు కుదవ పెట్టి రూ.56 లక్షల రుణం పొందిన ఆరుగురిపై నగరంలోని దేవరాజ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ మర్కంటైల్ బ్యాంక్ మేనేజర్... అబ్దుల్ జమీల్, ఏఎస్ సాగర్, పుట్టరాజు, హెచ్‌ఈ నాగరత్నరెడ్డి, దివ్య పీ.నంద పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకులో నగల అప్రైజరు ఎస్.రవీంద్రకుమార్‌ను వీరు ముందే కలిసి డబ్బులు ఇచ్చి మచ్చిక చేసుకున్నారు. తరువాత 782 గ్రాముల నకిలీ పసిడి ఆభరణాలను తాకట్టు పెట్టి రూ.56.78 లక్షల మేర రుణాన్ని పొందారు. ఈ నెల 14న సీనియర్ అప్రైజర్ నగలను పరిశీలిస్తుండగా నకిలీవని గుర్తించడంతో మోసం బయటపడింది.
బస్టాండులో గొలుసు మాయం
మైసూరు: రద్దీలో బస్సు ఎక్కుతున్న మహిళ మెడలో నుంచి రూ.4 లక్షలకు పైగా విలువ చేసే బంగారు గొలుసు మాయమైంది, మైసూరు గ్రామీణ బస్టాండ్‌లో ఈ దొంగతనం జరిగింది. గుండ్లుపేటె తాలూకా రాఘవాపుర గ్రామ నివాసి చంద్రచూడ మైసూరులోని బంధువు వైకుంఠ సమారాధనలో పాల్గొనేందుకు కుటుంబంతో వచ్చింది. ఊరికి వాపస్ వెళ్లేందుకు గ్రామీణ బస్టాండ్‌కు వచ్చి గుండ్లుపేటెకు వెళ్లే బస్సును ఎక్కారు. ఆ సమయంలో జన రద్దీ ఎక్కువగా ఉండగా, ఎవరో దొంగలు ఆమె మెడలోని 47 గ్రాముల బంగారు గొలుసును కొట్టేశారు. కొంతసేపటికి చూసుకున్న ఆమె లష్కర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.


