గుర్రాల సంత.. రాయబాగ చెంత
సాక్షి,బళ్లారి: గుర్రపు స్వారీ అంటే అదేదో సరదా అనుకుంటే పొరపాటు. గుర్రాలను పెంచడం, వాటిపై స్వారీ చేయడం ఒక పెద్ద కళ. గుర్రపు స్వారీ చేయడంలో ఎంతో ఆనందంగా ఉంటుందని గుర్రపు స్వారీదారులు అంటుంటారు. వేగంగా పరుగెత్తే గుర్రాలకు ఎంతో డిమాండ్ ఉంటుంది. పురాతన కాలం నుంచి రాజమహారాజుల హయాం నుంచి నేటి తరం వరకు గుర్రాలు అంటే దాదాపు అందరికీ ఇష్టమే. వాటిపై స్వారీ చేయడం అంటే అంత సులభమైన పని కాదు. వాహనాలు లేని పాత రోజుల్లో సుదూర ప్రాంతాలకు కూడా గుర్రాల్లోనే వెళ్లేవారు. ప్రస్తుతం గుర్రం కన్నా వేగంగా వెళ్లే అధునాతన వాహనాలు అందుబాటులోకి రావడంతో డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరూ ఖరీదైన కార్లు కొనుగోలు చేసుకుని తమ తమ గమ్యస్థానాలకు వెళ్లి వస్తున్నారు. అయితే మన సంస్కృతి వారసత్వాలకు అద్దం పట్టే గుర్రపు స్వారీ అంటే అందరూ ఇష్టపడతారు. గుర్రం మీద స్వారీ చేస్తే అదో వింతగా ఉంటుంది కూడా.
గుర్రం వాడకందారుల తగ్గుముఖం
మారుతున్న కాలానుగణంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, హెలికాప్టర్లు, పడవలు కూడా పెరిగిపోవడంతో గుర్రాలను వాడేవారి సంఖ్య ఏటేటా తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో గుర్రాల సంతతిని పెంచేందుకు, గుర్రపు స్వారీ చేసేందుకు ఎందరో శ్రమిస్తున్నారు. మహారాష్ట్రలో గుర్రపు స్వారీ చేసే వారి సంఖ్యగా బాగా ఉండటంతో మహారాష్ట్ర సరిహద్దున ఉన్న బెళగావి జిల్లాలో రాయబాగ పట్టణంలో ఏడాదిలో ఒకసారి జనవరిలో గుర్రపు సంత జరగడం విశేషం. ముందు కాలంలో రాజమహారాజులు, ధనవంతులు ఇష్టపడి పెంచి వాటిపై స్వారీ చేసేవారు. అలాంటి ఖరీదైన గుర్రాలు నేటికీ చాలా తక్కువగా ఉన్నప్పటికీ రాయబాగ పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జరిగే శ్రీలక్ష్మీదేవి జాతరలో ఏడాదికి ఒకసారి నిర్వహించే గుర్రపు సంతలో గుర్రాలు ఎంతో వైవిధ్యమైనవిగా, ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఎంతో అందంగా, రంగురంగుల గుర్రాలు వస్తుంటాయి. పంజాబ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వందలాది గుర్రాలను తెచ్చి విక్రయిస్తారు.
ఒక్కో గుర్రం విలువ రూ.10 లక్షలు
ఇటీవల రాయబాగలో నిర్వహించిన గుర్రాల సంతలో ఎంతో సుందరమైన, ఆరోగ్యవంతమైన గుర్రాలను తెచ్చి విక్రయించారు. ఒక్కో గుర్రం విలువ దాదాపు రూ.10 లక్షల వరకు పలికింది. గుర్రపుస్వారీ చేయాలనే ఆశ ఉన్నవారికి, గుర్రాలను ఇంటి వద్ద పెంచుకునే ఆసక్తి ఉన్న వారు పెద్ద సంఖ్యలో వచ్చి ఇష్టమైన గుర్రాలను కొనుగోలు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గుర్రాల సంతకు ప్రసిద్ధి చెందిన రాయబాగకు వచ్చి అన్ని రకాల గుర్రాలను కొనుగోలు చేసుకుని తమ తమ ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని పెంచుకుని స్వారీ చేసే వారు కూడా ఏటేటా పెరుగుతుండటంతో గుర్రాలు అమ్మకాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఖరీదైన గుర్రాలను తెచ్చి అమ్ముకుని వెళ్లడం విశేషం. మొత్తం మీద రాయబాగ గుర్రాల సంతకు ప్రసిద్ధి చెందడంతో చారిత్రాత్మకంగా గుర్తింపు పొందిన బెళగావి జిల్లాకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
సంతలో బారులు తీరిన గుర్రాలు
గుర్రానికి శిక్షణను ఇస్తున్న దృశ్యం
ఏడాది ఒకసారి జాతరలో జోరుగా గుర్రాల విక్రయాలు
వివిధ చోట్ల నుంచి గుర్రాలను తెచ్చి అమ్ముతున్న వైనం
గుర్రాల సంత.. రాయబాగ చెంత


