అటకెక్కిన కుక్కల సంతాన హరణ ప్రక్రియ
హుబ్లీ: హావేరి ఏపీఎంసీలో రూ.లక్షలాది వ్యయం చేసి ప్రారంభించిన వీధి శునకాల సంతాన హరణ(కు.ని) చికిత్సా కేంద్రాన్ని ప్రస్తుతం మూసివేశారు. ప్రారంభం అయిన కేవలం 40 రోజులకే కేంద్రంలో 83 శునకాలకు మాత్రమే సంతాన హరణ శస్త్ర చికిత్స చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ జిల్లా యంత్రాంగం వీధి శునకాలకు సంతాన హరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రాణిబెన్నూరు, బ్యాడిగి, హానగల్, హావేరిల్లో ఈ కేంద్రాలను తెరిచి శునకాలకు సంతాన హరణ ఆపరేషన్లు, అలాగే రేబిస్ టీకాలు వేసే ప్రక్రియను మొదలు పెట్టింది. అయితే జిల్లాలో వీధి కుక్కలకు సంతాన హరణ చికిత్సలు చేయడం కోసం ఏ ఒక్క సంస్థ కూడా కాంట్రాక్ట్‌కు దరఖాస్తు వేయలేదు. దీంతో విసిగిన హావేరి జిల్లా యంత్రాంగం ఆ జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయంతో వీధి శునకాలకు సంతాన హరణ చికిత్స ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలో హావేరి ఏపీఎంసీలో రూ.లక్షలాది వ్యయంతో సంబంధిత కేంద్రాన్ని తెరిచారు.
జిల్లాధికారి చేతుల మీదుగా ప్రారంభం
2025 డిసెంబర్ 19న హావేరి జిల్లాధికారి డాక్టర్ విజయ్ మహంతేష్ దాన్నమ్మనవర్ కేంద్రాన్ని ప్రారంభించారు. 25 కుక్కలకు సంతాన హరణ ఆపరేషన్ చేశారు. దీనిపై విమర్శలు రావడంతో మేల్కొన్న ఆ నగరసభ ఈనెల 10, 11 తేదీల్లో వరుసగా 30, 28 కుక్కలకు కు.ని ఆపరేషన్ చేసి కేంద్రాన్ని బంద్ చేశారు. కేంద్రం ప్రారంభమై 40 రోజులు పని చేసినా కూడా ఆపరేషన్ చేసింది మాత్రం 83 శునకాలకే. రోజుకు 30 కుక్కలకు ఆపరేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైద్యులు ఆపరేషన్ చేసి గుర్తు వేస్తారు. ఆ తర్వాత రేబిస్ టీకా కూడా వేస్తారు. అనంతరం మూడు రోజుల పాటు కుక్కలపై నిఘా ఉంచుతారు. వాటి ఆరోగ్య స్థిరత్వాన్ని బట్టి వాటిని పట్టిన స్థలంలోనే వదలాలనేది ఈ పథకం ఉద్దేశం అని నగరసభ అధికారులు తెలిపారు. పశుసంవర్థక శాఖ ప్రతి కుక్క ఆపరేషన్‌కు రూ.1645 లు నిర్ణయించింది. నగరసభ ఆరంభ శూరత్వం చూపించగా నగరంలోని 1400 కుక్కలకు గాను కేవలం 83 కుక్కలకు మాత్రమే ఆపరేషన్ చేశారు. మిగతా వాటి పరిస్థితి ఏమిటని స్థానికులు నిలదీస్తున్నారు. పైగా శాసీ్త్రయ రీతిలో ఆపరేషన్ చేయడం లేదని కూడా స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పారిశుధ్య కార్మికులతో కుక్కల పట్టివేత
కాగా కుక్కలను పట్టడానికి నిపుణులను నియమించకుండానే పారిశుధ్య కార్మికుల చేతే ఆ ప్రక్రియ తంతును మమ అనిపిస్తున్నారు. ఈ క్రమంలో సదరు సిబ్బంది కుక్క కాటుకు బలైన ఘటనలు కూడా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా బాధ్యతాయుతంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేయగా దీనిపై హావేరి మున్సిపల్ కమిషనర్ కాంతరాజు స్పందించారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టామన్నారు. ఆ మేరకు కాంట్రాక్టర్ టెండర్ వేశారు. ఆయనకు పని ఇవ్వడానికి ఆదేశాలు కూడా ఇచ్చామన్నారు. కాంట్రాక్టర్ జాప్యం చేశారన్నారు. పశుసంవర్ధక శాఖలో సిబ్బంది కొరత ఉండటంతో ఈ ప్రక్రియలో ఆపరేషన్ పూర్తిగా విజయవంతం కావడం లేదని సంబంధిత కాంట్రాక్టర్ పని మొదలుపెట్టగానే అన్నీ సజావుగా జరుగుతాయని, స్థానికులు ఈ విషయంలో ఆందోళన చెందరాదని కాంతరాజు హావేరి నగరసభ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
40 రోజులకే చికిత్సా కేంద్రం మూసివేత
వృథాగా లక్షలాది రూపాయల వ్యయం


