ధార్వాడలో మరో విషాదం
హుబ్లీ: మెడికల్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ధార్వాడ మానసిక ఆరోగ్య, నరాల రోగ విజ్ఞాన సంస్థ(డిమ్హాండ్) హాస్టల్‌లో చోటు చేసుకుంది. శివమొగ్గకు చెందిన డాక్టర్ ప్రజ్ఞ పాలేగర్(24) మృతి చెందిన విద్యార్థిని. ధార్వాడ డిమ్హాండ్‌లో సైకియాట్రిక్ పీజీ విద్యార్థిని అయిన డాక్టర్ ప్రజ్ఞ తొలి ఏడాది చదివేవారు. తాను ఉన్న గదిలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విద్యార్థిని రెండు వారాల క్రితమే కళాశాలకు వచ్చారు. మంగళవారం ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చి రాత్రి తిరిగి తమ సొంత ఊరు శివమొగ్గకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులు తమ గదిలో ఉంటారన్న నేపథ్యంలో ప్రజ్ఞ సహచరి ప్రియ బయట రూంలోనే ఉండిపోయారని తెలిసింది. తల్లిదండ్రులు వెళ్లాక రాత్రి ఒక్కతే గదిలో ఉన్న డాక్టర్ ప్రజ్ఞ ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు.
రూమ్‌మేట్ రాకతో ఘటన వెలుగులోకి
బుధవారం ఉదయం రూమ్‌మేట్ ప్రియ గదికి రాగా ఘటన వెలుగు చూసింది. ఘటన స్థలానికి ధార్వాడ ఉపనగర పోలీసులు వచ్చి పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. 25 ఏళ్ల ప్రజ్ఞ డిమ్హాండ్‌లో ఎండీ తొలి సంవత్సరం మనోవైద్య శాస్త్రం చదవడానికి వచ్చారు. ఈ నెల 1న అడ్మిషన్ అయ్యారు. తర్వాత 3న తరగతులకు హాజరు అయ్యారు. అయితే బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఆస్పత్రి ఉన్నతాధికారులు పోలీసులకు, అలాగే మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన తరలి వచ్చారు. బాగా చదువుకోవాలని తాము అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశంతోనే అడ్మిషన్ సమయంలో కూడా వచ్చామని తల్లిదండ్రులు తెలిపారు.
రెండు రోజులు కుమార్తెతోనే ఉన్నాం
రెండు రోజులు తమ కుమార్తెతోనే గదిలోనే ఉన్నామన్నారు. అయితే తల్లిదండ్రులు, కుమార్తె మధ్య ఏం జరిగిందో తెలియదని పోలీసులు తెలిపారు. తరగతి గదిలోను, ఆటపాటల్లో కూడా ప్రజ్ఞ చురుకుగానే ఉండేది. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అంతు బట్టడం లేదని డిమ్హాండ్ ముఖ్య పాలనాధికారి సిద్దలింగయ్య హిరేమఠ మీడియాకు తెలిపారు. కాగా మృతురాలి తల్లి డాక్టర్ రేఖా మాట్లాడుతూ మా అమ్మాయికి ఇక్కడికి వచ్చి ఉండటానికి ప్రారంభంలో కొంత ఉత్సాహం, ఆసక్తి తక్కువగానే ఉండేది. మేము చాలా నచ్చజెప్పాం.
హాస్టల్‌లో ఉండటానికి ఆమే ఒప్పుకుంది
ఎట్టకేలకు ఒప్పుకుని తానే ఆసక్తితో ఇక్కడికి వచ్చింది. తమ కుమార్తె ఆడ్మిషన్ సమయంలో ఎక్కువ విద్యార్థులు జరగలేదు. సద్దుకుంటానని కుమార్తె ఇష్టపడి వచ్చింది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలియరాలేదు. అలాగే కాలేజీలో చేరాక తనకు ఒంటరితనం వేధించేదని తెలిసింది. దీంతో రోజు ఫోన్ చేసి నచ్చజెప్పేవాళ్లం. ప్రారంభంలో ఎవరికై నా ఇది సాధారణమేనని, కాలక్రమంలో అన్నీ సర్దుకుంటాయని, పాత రోజులు గడిచి కొత్త రోజులు వస్తాయని తల్లిదండ్రులు తామెంతో నచ్చజెప్పినా కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడి తమకు గర్భశోకం మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మెడికల్ పీజీ విద్యార్థిని ఆత్మహత్య
హాస్టల్‌లో చేరిన నెల రోజులకే ఇలా


