10న నులిపురుగుల నివారణ దినోత్సవం
హొసపేటె: పిల్లలు నులిపురుగులు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడానికి ఫిబ్రవరి 10న జిల్లా అంతటా నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఫిబ్రవరి 16న మాప్‌అప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. బుధవారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా 1 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ ఉచితంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తారన్నారు. అందువల్ల తగినన్ని మందుల లభ్యతను నిర్ధారించుకోవాలన్నారు. స్టాక్‌లో ఉన్న మందులను జిల్లాలోని అన్ని తాలూకా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు నిర్ణీత సమయంలోపు అవసరానికి అనుగుణంగా పంపిణీ చేయాలన్నారు. అంగన్‌వాడీల్లో చేరని, బడి బయట ఉన్న పిల్లలందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు ఇవ్వాలని తెలిపారు. కుష్టు వ్యాధి నిర్మూలనపై పోస్టర్లను విడుదల చేశారు.


