రాఘవేంద్రులకు మధ్వ పూజలు
బనశంకరి: బెంగళూరు జయనగర 5వ బ్లాక్‌లోని నంజనగూడు శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠంలో శ్రీమధ్వనవమి పూజలు నిర్వహించారు. స్వామివారి బృందావనానికి వాయుస్తుతి, మధు, ఫల అభిషేకం, పవమాన హోమం తదితరాలు నిర్వహించినట్లు అర్చకులు నందకిశోర్ ఆచార్య తెలిపారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ప్రేమజంట గంజాయి దందా
యశవంతపుర: మత్తు పదార్థాలను అమ్ముతున్న ప్రేమ జంటను అరెస్ట్ చేసి 4 కేజీల గంజాయి, 37 గ్రాముల ఎండిఎంఎ, 35 గ్రాముల హషిష్, కారును స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు సుబ్రమణ్యనగర పోలీసులు ఉత్తరహళ్లి పూర్ణప్రజ్ణ నగరలో సోదాలు చేసి ఓ యువతీ యువకున్ని అరెస్టు చేసి ఈ డ్రగ్స్‌ను వశపరచుకున్నారు. వీరు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తెచ్చి బెంగళూరులో కాలేజీ విద్యార్థులకు అమ్ముతున్నట్లు తెలిపారు. అలాగే జాలహళ్లి పరిధిలోని రైల్వే వంతెన వద్ద ఎండిఎంఎ అమ్ముతున్న నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 31 గ్రాములను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వేసవి చాలా హాటు
● ఈసారి తగ్గేదేలే అనేలా ఎండలు?
దొడ్డబళ్లాపురం: ఈసారి చలికాలంలో బాగా చలివేస్తూ ప్రజలు కాస్త హాయిగానే ఉన్నారు. కానీ రాబోయే వేసవి చెమటలు పట్టించనుందని వాతావరణ శాఖ చెబుతోంది. మామూలు ఉష్ణోగ్రతల కంటే 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదవుతుందని తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి ఎండల తీవ్రత పెరుగుతుందని, వేసవి త్వరగా వచ్చేస్తుందని సమాచారం. ఇప్పటికే ఉదయం పూట చలి ఉంటూ, 10 గంటలు దాటితే ఎండ చుర్రుమంటోంది. డిసెంబర్ నెలలో చలి తీవ్రత విపరీతంగా ఉండడం కూడా ఎండలు పెరగడానికి ఒక కారణమనే వాదన ఉంది. ఫిబ్రవరి చివరి నుంచి ఎండలు బాగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.


