
టీవీ నటుడు ఆత్మహత్య
యశవంతపుర: కన్నడ కామెడీ కిలాడి షో ద్వారా ప్రజల మన్ననలను పొందిన ఉత్తర కన్నడ జిల్లా యల్లాపుర తాలూకా చిమ్మళ్లి గ్రామానికి చెందిన ఆఫ్రికన్ జాతీయుడు చంద్రశేఖర్ సిద్ది (31) ఆత్మహత్య చేసుకున్నాడు. యల్లాపుర తాలూకా కబ్బి గ్రామంలో భార్యతో కలిసి ఉన్నారు. టీవీలలో కామెడీ కిలాడి షోలో నవ్వించే మాటలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్రామంలో కూలీ పని చేసుకుంటూ జీవించేవాడు. శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు తన కొడుకును పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో మరుగుదొడ్డిలోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్లాడు అని అతని భార్య చుట్టూ వెతికింది. మరుగుదొడ్డిలో చూడగా శవమై ఉన్నాడు. రెండుమూడు నెలల నుంచి మానసికంగా ఇబ్బంది పడుతున్న సిద్ది కారవార క్రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు తెలిసింది. మృతుని తల్లి యల్లాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా టీవీ నటులు ఆత్మహత్యలు చేసుకోవడం అధికమైంది.
కాంగ్రెస్ ఎస్సీ మంత్రుల భేటీ
శివాజీనగర: సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీ.కే.శివకుమార్ ఢిల్లీ పర్యటనలో ఉండగా, ఇటు బెంగళూరులో ఎస్సీ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశాన్ని జరపడం కుతూహలానికి కారణమైంది. శనివారం సాయంత్రం హోం మంత్రి జీ.పరమేశ్వర్ ఇంటిలో ఈ సమావేశం జరిగింది. ఎస్సీలలో ఏబీసీడీ అంతర్గత రిజర్వేషన్ గురించి చర్చించినట్లు చెబుతున్నారు. ఇందులో సుప్రీంకోర్టు తీర్పు తరువాత ప్రభుత్వం హెచ్.ఎన్.నాగమోహన్‌దాస్ కమిషన్‌ను నియమించింది. కమిషన్ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఎస్సీల జనగణన సాగించారు. నివేదికను సమర్పించడం మిగిలిఉంది. వర్గీకరణ అవశ్యకత, ఇబ్బందుల గురించి చర్చ సాగిందని చెబుతున్నా, తాజా రాజకీయాలు సైతం ప్రస్తావనకు వచ్చాయి. ఇది తిరుగుబాటు కానీ, అసమాధానం కానీ కాదని ఎమ్మెల్యేలు చెప్పారు.