
బాదామి గుహాలయం
నయన మోహనం..
సాక్షి, బళ్లారి: శిలలపై శిల్పాలు చెక్కినారు మన వారు సృష్టికే అందాలు తెచ్చినారు అని ఓ మహాకవి తెలుగులో అద్భుతమైన పాటను రాశారు. అంటే అందుకు కారణం దేశంలో పలు ప్రాంతాల్లో శిల్పులు శిలలపై అద్భుతమైన కళాసంపదను సృష్టించడమే. కర్ణాటకలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీలో ఏ విధంగా శిల్పులు తమ కళా ప్రతిభను చూపారో కర్ణాటకలో బాదామి, పట్టదకల్ తదితర ప్రాంతాల్లో కూడా అద్భుతమైన శిల్పకళా సంపద ఉట్టిపడుతోంది. ముఖ్యంగా బాదామి ప్రాంతంలో చారిత్రాత్మకమైన అరళి తీర్థలో సుందరమైన పర్యాటక ప్రదేశాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ప్రశాంత వాతావరణంలో అద్భుతమైన శిల్ప కళా సంపదను చూడవచ్చు. అక్కడ సందర్శించిన ప్రతి సారి కొత్తకొత్త రీతిలో పర్యాటకులకు అగుపించడం విశేషం. బాదామి చాళుక్యుల కాలంలో నిర్మించిన స్మారకాలు, శిల్పాలు కళాప్రతిభకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సౌందర్యమైన కళాసంపదను దూరదృష్టితో నిర్మించారు. వస్తు సంగ్రహాలయం, ఎత్తైన కొండలో శివాలయం, రెండంతస్తుల మంటపం, అగస్థ్య తీర్థం, పరిసరాల్లో తూర్పున ఉన్న కొండలో కనిపించే భూతనాథ ఆలయాల సమూహం తదితర ప్రాంతాలు ఎన్ని సార్లు చూసినా తనివితీరని అద్భుతమైన కళా సంపదగా కీర్తి చెందింది.
గుహల్లో ప్రాచీన మూర్తుల విగ్రహాలు
ఆశ్చర్యం కలిగించేలా అక్కడ చిన్న గుహలో చెక్కిన ప్రాచీన మూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. వీటిని చూస్తేనే అపారమైన అనుభూతి కలుగుతుంది. గుట్టపై ఉన్న చిన్నపాటి కొలనే ఈ అరళి తీర్థం. అంతగా లోతు కనిపించని ఈ నీటిలో ఏర్పడిన కొలను అక్కడక్కడ పాచీ, చిన్నా చితకా మొక్కలతో నయనమనోహరంగా కనిపిస్తాయి. ఎర్రమట్టి శిలలతో ఏర్పడిన అరళి తీర్థం గుట్టప్రాంతం ప్రకృతి గుహలతో రూపొందింది. ప్రకృతి పరంగా గొడుగుల మాదిరిగా నిర్మితమైన ఈ చిన్న చిన్న గుహల్లో సుమారు 25 అడుగుల మేర విశాలమైన తెరచిన గుహ, లోపలి అంచుపై వినాయకుడు, అనంతశయన, మహిషాసుర మర్థిని, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సూర్యదేవుల మూర్తులున్నాయి. రెండున్నర అడుగుల ఎత్తున వెడల్పుతో లోపల, బయటకు తీర్చిదిద్దిన శిల్పాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న శిల్పాల్లో సూర్యదేవుడి శిల్పం అత్యంత మనోహరంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి ఎనిమిది చేతులున్న సూర్యదేవుడి ఖడ్గం, డాలు, విల్లు, బాణం, త్రిశూలాలు కాకుండా కమలం పువ్వును పట్టుకొన్న సారథితో సప్తహస్తాల రథంలో కమలం పీఠంపై నిలబడ్డాడు. ఆయన పక్కన చామర శిల్పాలున్నాయి.
ప్రతి రాయిలో ఉట్టిపడిన అద్భుత శిల్పకళా సౌందర్యం
పర్యాటకులతో పాటు భక్తులకు
కనువిందు కల్గిస్తున్న వైనం

బాదామి గుహాలయం