
పులి జాడ.. చివరి మజిలీ ఎక్కడ?
మైసూరు: జాతీయ జంతువు పులి, వర్సెస్ అటవీ గ్రామాల ప్రజలుగా పరిస్థితి తయారైంది. పులి నిబంధనల పేరుతో తమ దైనందిన జీవితాలను కట్టుదిట్టం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. చామరాజనగర జిల్లాలో మలేమహదేశ్వర బెట్ట పరిధిలోకి వచ్చే అటవీ ప్రాంతంలో విషం పెట్టడం వల్ల ఐదు పులులు మరణించిన ఘటన కొన్ని గ్రామాలకు ఇబ్బందులను కలిగిస్తోంది. జనం అడవిలోకి అనవసరంగా ప్రవేశించకుండా అటవీశాఖ నిర్బంధం విధించారు. ముఖ్యంగా గ్రామాల్లో అనారోగ్యాలతో , తదితర కారణాల వల్ల మరణించిన వారి అంత్యక్రియలకు స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు. నంజనగూడు తాలూకా మహదేవనగర గ్రామం ప్రజలకు ప్రస్తుతం ఈ సమస్య ఎక్కువగా ఉంది. చనిపోతే అంత్యక్రియలు ఎక్కడ అని తలబాదుకోవాల్సి వస్తోందంటున్నారు.
అడవిలోకి రావద్దు
బండీపుర జాతీయ ఉద్యానవనం అడవిని ఆనుకుని ఉండే మహదేవనగరలో ఎవరు మరణించినా అటవీ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించే వారు. తాజాగా పులుల మరణం కారణంగా అటవీ ప్రాంతంలోకి ప్రవేశం నిర్బంధించడంతో వీరికి ఇబ్బంది ఏర్పడింది. మృతదేహాల అంత్యక్రియలకు అడవిలోకి వెళ్లనివ్వడం లేదని వాపోయారు. తమ వారి అంత్యక్రియలకు స్థలం కేటాయించాలని రెవెన్యూ, అటవీ అధికారులను కోరుతున్నారు.
నానా యాతన
తాజాగా గ్రామంలో ఒక మరణం జరిగింది. మృతదేహాన్ని ఖననం చేసేందుకు స్థలం లేదు. తాలూకా పాలన అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. చివరకు ఇంటి ముందే గొయ్యి తవ్వి శవాన్ని పూడ్చాలని తొలుత భావించినా, ఆ తర్వాత మహదేవనగర నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న హోసవీడు గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. పొరుగు గ్రామాన్ని ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. పులుల మరణాలను సాకుగా చూపి తమ జీవితాలను కట్టడి చేయవద్దని, తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.
చామరాజనగర జిల్లా అడవుల్లో పులులు
ఇటీవల 5 పులులు మృతి..
అడవిలోకి పల్లెవాసులు వెళ్లకుండా కట్టడి
అంత్యక్రియలకు నానా అవస్థలు
శ్మశానికి స్థలం ఇవ్వాలని మొర

పులి జాడ.. చివరి మజిలీ ఎక్కడ?