
రాజహంసకు ప్రమాదం
కోలారు: కేఎస్ ఆర్టీసీ లగ్జరీ రాజహంస బస్సుకు స్వల్ప ప్రమాదం జరిగింది. డివైడర్ మీదకు దూసుకెళ్లి నిలిచిపోయింది. తాలూకాలోని చుంచదేనహళ్లి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి కోలారు మీదుగా కేజీఎఫ్‌కు వెళుతున్న బస్సు ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు మధ్యలోని ఖాళీ స్థలంలోకి వెళ్లి నిలిచిపోయింది. బస్సు డ్రైవర్, ప్రయాణికులకు చిన్న గాయాలు అయ్యాయి. బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయాలైన వారికి నగరంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
10న ప్రధానిచే మెట్రో
ఎల్లో లైన్‌కు నాంది
శివాజీనగర: బెంగళూరు మెట్రో ఎల్లో లైన్ రైలు సేవలను ప్రధాని మోదీ ఈ నెల 10వ తేదీన ప్రారంభిస్తారని తెలిసింది. ఆర్.వీ.రోడ్డు నుంచి బొమ్మసంద్ర వరకు మెట్రో ఎల్లో రైలు సంచరిస్తుంది. ఇది సిల్క్‌బోర్డు మార్గంలో ట్రాఫిక్ రద్దీని చాలా తగ్గించనుంది. ఈ మార్గం పొడవు 19.15 కి.మీ. ఇప్పటికే మూడు రైళ్లు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ టిటాగడ్ రైల్ కార్మాగారం నుండి నాలుగో రైలును పంపించారు. 10వ తేదీలోగా బెంగళూరుకు చేరుకొంటుంది. ప్రధాని మోదీ ఈ మార్గానికి రిబ్బన్ కట్ చేస్తారని కేంద్ర వసతి, నగర వ్యవహారాల మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సోషల్ మీడియాలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
6 నుంచి వర్షసూచన
యశవంతపుర: రాష్ట్రంలో కొన్నిరోజులుగా వానలు తగ్గాయి, రైతులు వర్షం కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో 6వ తేదీ నుంచి 3 రోజుల పాటు మళ్లీ భారీగా వానలు పడే అవకాశం ఉందని బెంగళూరు వాతావారణశాఖ అధికారులు తెలిపారు. బెంగళూరు, రూరల్, చిక్కబళ్లాపుర, హాసన్, కొడగు, కోలారు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించారు. ఇంకా అనేక జిల్లాలకు అలర్ట్ ఇచ్చారు. ఆదివారం కార్వార, చిక్కమగళూరు జిల్లాల్లో వానలు పడ్డాయి. బెంగళూరు చుట్టుపక్కల మేఘావృతమై ఉంది.
నీటి ట్యాంకులో విషం.. ముగ్గురు అరెస్టు
దొడ్డబళ్లాపురం: బెళగావి జిల్లా సవదత్తి తాలూకా హూలికట్టి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల సమీపంలోని నీటి ట్యాంక్‌లో పురుగుల మందును కలిపిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రెండువారాల కిందట ఆ నీటిని తాగి పలువురు విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు. పాఠశాల హెచ్‌ఎంను బదిలీ చేయించాలనే దురుద్దేశంతో శ్రీరామసేన తాలూకా నాయకుడు సాగర్ పాటిల్, మరో ఇద్దరు ఈ పన్నాగం పన్నినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ అంశాన్ని సీఎం సిద్ధరామయ్య ఎక్స్‌లో పోస్టు చేయడం గమనార్హం. మతోన్మాదంతో కొందరు చిన్న పిల్లల ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వాటర్ ట్యాంక్‌లో విషం కలపడం కలవరపెడుతోందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టేవారిపై నిఘా పెట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.

రాజహంసకు ప్రమాదం