
ఆందోళనకర స్థాయిలో మృత శిశువుల జననాలు
బనశంకరి: ఎన్నో ఆశలతో గర్భం దాలిస్తే, పుట్టింది మృతశిశువు అని తెలిసిన తల్లి గుండె మంట, కడుపు కోతకు పరిహారం ఏమిటి? రాష్ట్రంలో నిర్జీవ శిశువుల జననం అధికమవుతోంది. ఆధునిక వైద్యరంగం ఎంతో ప్రగతి సాధించినప్పటికీ శిశువుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. గర్భంలో, లేదా కాన్పు సమయంలో శిశువు కన్నుమూయడం (స్టిల్ బర్త్) సమస్య అనేక జిల్లాల్లో పెద్ద సమస్యగా ఉంది. 12 జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. విచిత్రం ఏమిటంటే.. గ్రామీణ ప్రదేశాల కంటే నగరాలు, పట్టణాల్లో మృత శిశువుల జననం ఎక్కువగా ఉండడం.
వెయ్యి మందిలో 3.41 కేసులు..
రాష్ట్రంలో జన్మిస్తున్న ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 3.41 శాతం మంది నిర్జీవులు. కొన్ని జిల్లాల్లో ఇది 9.30 శాతం ఉండడంతో ఆరోగ్యశాఖ కు సవాల్‌గా మారింది. 2024 ప్రభుత్వ గణాంకాల హవేరి జిల్లాలో అధిక కేసులు నమోదు కాగా తదుపరి స్థానాల్లో ధారవాడ, చామరాజనగర, గదగ, మైసూరు, బళ్లారి జిల్లాలు ఉన్నాయి.
ఆ జిల్లాల్లో పెరుగుదల
తల్లీ బిడ్డల మరణాలు పెరగడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. వైద్యసేవల ప్రామాణికతకు దీనిని మైలురాయిగా తీసుకుంటారు. 2020లో మంచి ర్యాంకులో ఉన్న మైసూరు, చిక్కమగళూరు, బెంగళూరు గ్రామాంతర, బళ్లారి, దావణగెరె జిల్లాల్లో 2–3 ఏళ్ల నుంచి నిర్జీవ శిశువులు జనన రేటు పెరగడం గమనార్హం. 2020లో 9,88,143 జననాల్లో 3,326 మంది నిర్జీవ శిశువులు ఉన్నారు. ఇందులో 221 మంది (2.11 శాతం) గ్రామీణ, 3,105 (5.24 శాతం) నగర ప్రదేశాల్లో ఉన్నారు.
ఈ జిల్లాలు మేలు
స్టిల్ బర్త్ నియంత్రణలో హాసన్, కొడగు, యాదగిరి జిల్లాలు ఆదర్శంగా ఉన్నాయి. 2023లో యాదగిరి జిల్లాలో ఒక్క మృత శిశు జననం కూడా నమోదు కాలేదు. గత రెండేళ్లలో నిర్జీవ జనన రేటు 1.5 శాతానికి దాటలేదు. బెంగళూరు నగరం, కొప్పళ, రామనగర జిల్లాల్లో 2 శాతం, మండ్య, బెళగావి, రాయచూరు, బీదర్, కలబుర్గి, కోలారు, తుమకూరు జిల్లాల్లో 3 శాతంలోగా ఉంది.
నివేదిక రావాలి: మంత్రి
నిర్జీవ శిశు మరణాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేశ్ గుండూరావ్ తెలిపారు. హావేరి, గదగ్, ధార్వాడ జిల్లాల్లో ఎందుకు శిశు మరణాలు పెరుగుతుయో అధికారులు నివేదిక వచ్చాక నివారణ చర్యలను చేపతామని చెప్పారు.
ఇందుకు కారణాలపై వైద్యశాఖ పరిశీలన చేస్తోంది. ప్రసూతి సమయంలో తలెత్తిన శ్వాసకోశ ఇబ్బంది, గర్భిణిలు జాగ్రత్తలు పాటించకపోవడం, అసురక్షిత పరిస్థితుల్లో ప్రసవం, గర్భస్రావం, కాన్పు సమయాల్లో తీవ్ర జ్వరం వంటి అనారోగ్యాలు తదితర కారణాలు వెలుగుచూశాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. తల్లికి మధుమేహం, బీపీ, థైరాయిడ్, అధిక బరువు, వరుసగా గర్భధారణలు, గతంలో ప్రసూతిలో నిర్జీవ శిశువు జననం, అవధికి ముందుగా జననం, తల్లికి ధూమ, మద్యపానం అలవాట్లు, మేనరికాలు, కొన్ని రకాల ఔషధాలను వాడడం వల్ల సమస్య వస్తోందని ప్రసూతి నిపుణురాలు డాక్టర్ ఉమా సుల్తానపురి తెలిపారు.
రాష్ట్రంలో 12 జిల్లాల్లో అధికం
పల్లెల కంటే పట్టణాల్లో తీవ్రం

ఆందోళనకర స్థాయిలో మృత శిశువుల జననాలు

ఆందోళనకర స్థాయిలో మృత శిశువుల జననాలు