అన్ని రంగాల్లో దేశ ప్రగతి | - | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లో దేశ ప్రగతి

Mar 28 2025 1:37 AM | Updated on Mar 28 2025 1:33 AM

మైసూరు: యువత నిరంతర ప్రయత్నాలతో దేశ ప్రగతి సాధ్యమని రాష్ట్ర గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ పేర్కొన్నారు. గురువారం మైసూరులోని ముక్తగంగోత్రిలో కర్ణాటక రాష్ట్ర ఓపెన్‌ విశ్వవిద్యాలయం 20వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్‌ పాల్గొని మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం దేశంలోని అన్ని రంగాల్లో అనూహ్యమైన ప్రగతిని సాధించిందన్నారు. ప్రస్తుత దేశ ఆర్థికత ప్రబలంగా ఉండి ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందన్నారు. స్నాతకోత్సవంలో సీఎం ఇర్ఫానుల్లా షరీఫ్‌, డాక్టర్‌ దాక్షాయణి ఎస్‌.అప్పాలకు గౌరవ డాక్టరేట్‌ పట్టాలు అందించి సత్కరించారు.

వ్యాన్‌– గూడ్స్‌ టెంపో ఢీ, ముగ్గురు మృతి

దొడ్డబళ్లాపురం: బెంగళూరు– మైసూరు రహదారిలో చెన్నపట్టణ తాలూకా తిట్టమారనహళ్లి వద్ద సర్వీస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోయారు. గూడ్స్‌ టెంపో, మారుతి వ్యాన్‌ ఢీకొన్నాయి. గురువారం ఉదయం చెన్నపట్టణ తాలూకా మంగాడహళ్లికి చెందిన శివప్రకాశ్‌ కుటుంబం మండ్యలో బంధువుల ఇంట్లో శుభ కార్యానికి మారుతి–800 వ్యాన్‌లో వెళ్తోంది. తిట్టమారనహళ్లి వద్ద సర్వీస్‌ రోడ్డులో ఎదురుగా వచ్చిన టెంపో వేగంగా ఢీకొంది. మారుతి వ్యాన్‌ నుజ్జునుజ్జు కాగా, అందులోని శివప్రకాశ్‌ (37), పుట్టగౌరమ్మ (72), శివరత్న (50) మరణించారు. నటరాజ్‌, సుమ, టెంపో డ్రైవర్‌ నాగేశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను, క్షతగాత్రులను చెన్నపట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

లోకాయుక్త అదుపులో

ఆర్‌టీఐ కమిషనర్‌

దొడ్డబళ్లాపురం: రాష్ట్ర ఆర్టీఐ కమిషన్‌ కమిషనర్‌ రవీంద్ర గురునాథ్‌ డాకప్ప లంచం తీసుకుంటూ లోకాయుక్తకు పట్టుబడ్డ సంఘటన కలబుర్గిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఎన్‌.సీ.బెనకనళ్లి అనే ఆర్టీఐ కార్యకర్త ఏకధాటిగా 117 దరఖాస్తులు చేయడంతో అతనిని బ్లాక్‌ లిస్టులో చేర్చారు. తన పేరు బ్లాక్‌ లిస్టు నుండి తొలగించాలని కోరగా గురునాథ్‌ రూ.3లక్షలు డిమాండు చేశాడు. దీంతో ఆర్టీఐ కార్యకర్త లోకాయుక్తను ఆశ్రయించాడు. లంచం తీసుకుంటూ ఉండగా లోకాయుక్త అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. గురునాథ్‌ ఏప్రిల్‌ నెలలో రిటైరు కానున్నారు. ఇంతలో పట్టుబడ్డాడు.

ముగ్గురు పోలీసులపై కేసు

మూడేళ్ల కిందట ఖైదీ మృతి ఘటన..

యశవంతపుర: మూడేళ్ల కిందట వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన నిందితుడు జిమ్స్‌ ఆస్పత్రి కట్టడంపై నుంచి దూకి చనిపోయిన ఘటనలో ఒక ఏఎస్‌ఐతో పాటు ముగ్గురు పోలీసులపై ఇప్పుడు కేసు నమోదు చేశారు. కలబురగి బ్రహ్మపుర పోలీసుస్టేషన్‌ ఎఎస్‌ఐ అబ్దుల్‌ ఖాదర్‌ (54), కానిస్టేబుల్స్‌ హుణచప్ప మల్లప్ప (56), కుమార రాథోడ్‌ (22)లపై కేసు నమోదైయింది. నిందితుడు సోహేబ్‌ (20)ను ఓ కేసులో బ్రహ్మపుర పోలీసులు 2022 అగస్ట్‌ 8న అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరు పరచడానికి ముందు నిందితునికి కరోనా టెస్టుల కోసం జిమ్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బేడిలను విప్పేశారు. ఇదే అదనుగా అతడు తప్పించుకోవాలని పరుగులు తీసి ఆస్పత్రి మూడో అంతస్తు మీద నుంచి దూకాడు. తలకు బలమైన గాయలై అక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ఉందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం కేసును సీఐడీ అప్పగించింది. సీఐడీ పోలీసులు పై ముగ్గురి మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

నగల బ్యాగును

వదిలి దొంగ పరారీ

మైసూరు: పోలీసును చూసి దొంగ బ్యాగును అక్కడే వదిలి పరారైన ఘటన నగరంలో జరిగింది. అతని బ్యాగులో నుంచి రూ.7.20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదును పోలీసులు స్వాధీనపరచుకున్నారు. వివరాలు.. నగరంలోని విజయనగర పోలీసు స్టేషన్‌ కానిస్టేబుల్‌ ఎస్‌ఎం అనంత, హోంగార్డు రఘుకుమార్‌ గస్తీలో ఉండగా, గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో హూటగళ్లి సిగ్నల్‌ వద్ద ఓ వ్యక్తి నంబరుప్లేట్‌ లేని వాహనంతో నిలబడి ఉండటాన్ని గమనించారు. అతని వద్దకు వెళుతుండగా భయపడిన అతను బైక్‌ని, బ్యాగును వదిలి అక్కడి నుంచి సందులోకి పారిపోయాడు. పోలీసులు బ్యాగును తెరిచి చూడగా బంగారు ఆభరణాలు, నగదు, ఇనుప రాడ్డు లభించాయి. పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచారు. దొంగ ఎక్కడైనా చోరీ చేసి వస్తుంటాడని అనుమానాలున్నాయి. అతని కోసం గాలింపు చేపట్టారు.

అన్ని రంగాల్లో దేశ ప్రగతి  1
1/1

అన్ని రంగాల్లో దేశ ప్రగతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement