
చాపకింద నీరులా ఐపీఎల్ బెట్టింగ్
కోలారు: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ దందా నగరంలో చాపకింద నీరులా సాగుతోంది. పోలీసులు ఇంతవరకు అరెస్టు చేసిన వారు చిన్న చిన్న చేపలు కాగా బెట్టింగ్ దందాలో ఉన్న ఇంకా పెద్ద పెద్ద తిమింగలాలు అజ్ఞాతంలో ఉండి వ్యవహారం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఇంతవరకు నాలుగు బెట్టింగ్ కేసులను ఛేదించి కేవలం చిన్న మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలువురు పంటర్‌లు ముంబై, గోవాల్లో కూర్చుని అక్కడి నుంచే వ్యవహారాలు నడిపిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ క్రికెట్ టోర్నీ అంతమ దశకు చేరుకుంది. ఐపీఎల్‌పై దేశ విదేశాలలో భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్ల మధ్య జరిగిన పోటీపై భారీ ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కోలారు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెట్టింగ్ సాగుతుండగా పలు కేసులను పోలీసులు ఛేదించారు.
బెట్టింగ్‌లోకి ఆస్తులు, బంగారం
జూదర్లు డబ్బులతో పాటు బంగారం, ఆస్తులను బెట్టింగ్‌లో పెట్టడానికి వెనుకంజ వేయడం లేదు. కోలారు జిల్లాలో జరుగుతున్న ఐపీఎల్ బెట్టింగ్ దందాను అరికట్టడానికి జిల్లా ఎస్పీ ఎం నారాయణ ప్రత్యేక బృందాన్ని రచించారు. వారం రోజుల క్రితం గల్‌పేట పోలీసులు బెట్టింగ్‌లో పాల్గొన్న నలుగురిని అరెస్టు చేశారు. శనివారం మరో బెట్టింగ్ అడ్డాపై దాడి చేసి ఒకరిని అరెస్టు చేశారు. శ్రీనివాసపురంలో బెట్టింగ్‌లో పాల్గొన్న ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. కోలారు నుంచి దుబై వరకు క్రికెట్ బెట్టింగ్ దందా జోరుగా సాగుతుందని అంటున్నారు. గతంలో బెట్టింగ్ పంటర్‌లు కోలారులోనే ఉండి వ్యవహారం నడిపే వారు. గత రెండేళ్లుగా పోలీసు యంత్రాంగం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగా వీరు దూర ప్రాంతాల్లో కూర్చుని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరు అక్కడి నుంచే ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కాగానే బెట్టింగ్ యాప్ లింక్ పంపించడం, ఆన్‌లైన్ బెట్టింగ్ ఐడీలు పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఆన్‌లైన్‌లోనే డబ్బు వ్యవహారం జరుగుతుంది.
బెట్టింగ్‌పై నిఘా పటిష్టం
బెట్టింగ్ అడ్డుకట్టకు ప్రత్యేక బృందాన్ని రచించాం. క్రికెట్ బెట్టింగ్ యాప్‌లపై, పోలీసులపై కూడా నిఘా పెట్టాం. క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలిస్తే, పోలీసులు పాల్గొంటున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. పోలీసులు బెట్టింగ్ దందా నిర్వహిస్తున్న వారితో చేతులు కలిపినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
–ఎం నారాయణ, ఎస్పీ, కోలారు

చాపకింద నీరులా ఐపీఎల్ బెట్టింగ్