మళ్లీ కుర్చీ అలజడి
శివాజీనగర: సీఎం కుర్చీ మార్పు గురించి అవసరమైతే ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్‌ను ఢిల్లీకి పిలిపించి మాట్లాడతామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. సోమవారం బెంగళూరు సదాశివనగరలో నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన గతంలో అసలు సీఎం మార్పు వివాదం హైకమాండ్ సృష్టించినది కాదు, రాష్ట్ర నాయకులే గొడవ చేసుకొన్నారు. వారే పరిష్కరించుకోవాలని చెప్పడం తెలిసిందే. దీంతో డిప్యూటీ సీఎం వర్గం నిరాశకు గురైంది. అధిష్టానం కలగజేసుకుంటే తమకు ప్రయోజనమని డీకే వర్గం ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి పిలుస్తామని ఖర్గే చెప్పడం గమనార్హం.
అనూహ్యంగా భేటీ
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మల్లికార్జున ఖర్గేతో మంతనాలు జరపడంతో సీఎం మార్పు అంశం మళ్లీ కాస్త వేడెక్కింది. సంక్రాంతి తరువాత రాష్ట్రంలో సంచలనం జరుగుతుందని, వేచి చూడండని డీకే సన్నిహితులు చెబుతున్న సందర్భంలో ఈ భేటీ జరిగింది. గత నెలలో సీఎం సిద్దరామయ్య, డీసీఎంలు, వారి అనుచర మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా ఢిల్లీ యాత్రలు, పోటీ సమావేశాలు జరపడం, వాడీవేడిగా ప్రకటనలు చేయడం తెలిసిందే. కానీ అధిష్టానం ఏమీ తేల్చకపోవడంతో విషయం చప్పబడిపోయింది. డీకే శివకుమార్.. రాష్ట్ర పర్యటనలో ఉన్న ఖర్గేతో సమావేశం జరపడం ప్రాధాన్యంగా మారింది. సుమారు ముప్పావు గంటకు పైగా మాట్లాడినట్లు తెలిసింది.
ఏం మాట్లాడారు..?
ఒప్పందం ప్రకారం తనకు ముఖ్యమంత్రి కుర్చీని విడిచిపెట్టాలని డీకే డిమాండ్ చేశారని తెలిసింది. కానీ తాను ఏమీ చేయలేనని ఖర్గే బదులిచ్చారని సమాచారం. రాహుల్‌గాంధీని కాదని వెళ్లలేనన్నారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ భేటీకై నా సమయం ఇప్పించాలని డీకే విన్నవించారు. అసోం అసెంబ్లీ ఎన్నికల గురించి ఈ నెల 16, 22న ఢిల్లీలో ముఖ్యమైన సమావేశాలు జరుగుతాయి, అందులో అవకాశం ఉంటుందని ఖర్గే భరోసా ఇచ్చారని తెలిసింది. కాంగ్రెస్ అసోం ఎన్నికల పరిశీలకునిగా డీకేను నియమించడం తెలిసిందే. దీంతో ఢిల్లీ సమావేశాలకు ఆయన వెళతారు. కాగా, డీకే, ఖర్గే ఒకే కారులో విమానాశ్రయానికి వెళ్లారు. కలబుర్గి జిల్లా యద్రామిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలతో వీరితో పాటు సీఎం సిద్దరామయ్య కూడా పాల్గొన్నారు.
ఈ దఫా పోరాటాన్ని ఉధృతం చేయాలని డీకే నిశ్చయించినట్లు సమాచారం. రాహుల్‌గాంధీని ఎలాగైనా కలిసి పదవి కోసం ఒత్తిడి చేయాలని అనుకున్నారు. అసోం ఎన్నికల ఇన్‌చార్జిగా ప్రియాంకగాంధీ ఉండడంతో ఆమెతోనూ మాట్లాడి నెరవేర్చుకోవాలనుకుంటున్నారు.
సీఎం, డీసీఎంలను ఢిల్లీకి పిలిపిస్తాం: ఖర్గే
ఖర్గేతో శివకుమార్ సుదీర్ఘ మంతనాలు
పార్టీ పెద్దల అపాయింట్‌మెంట్‌కు వినతి


