నాణ్యతగా భవనాన్ని నిర్మించండి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి పట్టణంలోని హొసపేటె రోడ్డులో రూ.46.06 లక్షలతో షెడ్యూల్డ్ కులాల ప్రీ–మెట్రిక్ బాలికల హాస్టల్ నిర్మాణ పనులకు సోమవారం కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్.శ్రీనివాస్ భూమి పూజను నెరవేర్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం నుంచి గ్రాంట్‌ను తెచ్చామన్నారు. భవనాన్ని నాణ్యమైన రీతిలో నిర్మించాలని ఆయన కాంట్రాక్టర్లను ఆదేశించారు. హాస్టల్ విద్యార్థుల శ్రేయస్సు గురించి ఆరా తీసిన ఆయన నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యపై మరింత శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాలను పరిశీలించి వారి ఫిర్యాదులను ఆలకించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జగదీశ్ దిండూర్, బీఈఓ మిలేషా బేవూరు, పార్టీ నేతలు టీజీ మల్లికార్జున గౌడ, కావలి శివప్ప నాయక్, స్టాండింగ్ కమిటీ మాజీ అధ్యక్షుడు సయ్యద్ షుకూర్, రాఘవేంద్ర, విభూతి ఈరన్న, మల్లన్న, సిద్దరామేష్, బొమ్మలాపుర బసవరాజ, కబేర, లంకేష్, హాలేష్, ఫక్కీరప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.


