నేటి నుంచి ఉమ్మడి జిల్లాచదరంగం పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఉమ్మడి జిల్లాచదరంగం పోటీలు

Nov 28 2026 12:56 AM | Updated on Nov 28 2026 12:56 AM

కొడిమ్యాల: మండలకేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం నుంచి 70వ ఎస్జీఎఫ్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాస్థాయి చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈవో శ్రీనివాస్‌ తెలిపారు. పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పాఠశాల ఇన్చార్జి హెచ్‌ఎం కె.ప్రణీత శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు, అధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజన వసతి కల్పిస్తున్నట్లు సర్పంచ్‌ గడ్డం జీవన్‌రెడ్డి తెలిపారు. పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలకు పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ బూట్ల రాజమల్లయ్యను 94414 31287 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.

కాజీపేట– పుణె

రైలుస్థాయి తగ్గింపు

రామగుండం: కాజీపేట–పుణె మధ్య నడిచే పుణె సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (11437/38) స్థాయి తగ్గించి వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి సాధారణ ఎక్స్‌ప్రెస్‌ హోదాలో రాకపోకలు సాగించనుంది. ఇకనుంచి సాధారణ జనరల్‌ టికెట్‌పై రూ.15, స్లీపర్‌ క్లాస్‌ రిజర్వేషన్‌పై రూ.30, సెకండ్‌, థర్డ్‌ ఏసీపై రూ.45 వరకు సర్‌చార్జీ తగ్గనున్నాయి. కాజీపేటలో బయలుదేరి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్హర్షా, చంద్రాపూర్‌, భండక్‌, వరోరా, హింగన్‌ఘాట్‌, వార్దా జంక్షన్‌, పుల్గావ్‌, ధామన్‌గావ్‌, బద్నేరా, అకోలా, షెగావ్‌, భుసావల్‌, మన్మాడ్‌, కోపర్‌గావ్‌, అహల్యనగర్‌, దౌండ్‌కార్డ్‌లైన్‌, పుణె జంక్షన్‌లో హాల్టింగ్‌ సౌకర్యం ఉంది.

జగిత్యాల వైద్యుడికి

అరుదైన అవకాశం

జగిత్యాలజోన్‌: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ భీమనాతిని శంకర్‌కు న్యూఢిల్లీలో జరిగే భా రత ఫిజిషియన్ల సదస్సులో ప్రసంగించే అరుదైన అవకాశం దక్కింది. ఈ మేరకు శుక్రవారం ఆహ్వాన పత్రిక అందింది. అఖిల భారత ఫిజిషియన్ల సదస్సు ఢిల్లీలో ఫిబ్రవరి 18–21 వరకు జరుగుతుండగా, అందులో డాక్టర్‌ శంకర్‌ ‘గర్భధారణ సమయంలో థైరాయిడ్‌ సమస్యలు–నిర్ధారణ, నివారణ, చికిత్సలు’ అనే అంశంపై ప్రసగించనున్నారు.

క్లాసిక్‌ అభిరుచి రెస్టారెంట్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌

కరీంనగర్‌అర్బన్‌: నగరంలోని వావిలాలపల్లిలో క్లాసిక్‌ అభిరుచి మల్టీ క్యూజిన్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌లో శుక్రవారం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆహార పరిశుభ్రత, పారిశుధ్యం, ఆహార తయారీ నిర్వహణలో తీవ్రమైన ఉల్లంఘనలు గుర్తించామని గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ రోహిత్‌రెడ్డి వివరించారు. బిర్యానీ, ఇతర స్టార్టర్స్‌ తయారీలో ఫుడ్‌ కలర్స్‌ ఉపయోగిస్తున్నారని, మాంసాన్ని అత్యంత అపరిశుభ్ర ప్రాంతంలో నిల్వ చేయగా సుమారు 30 కిలోల ఆహార/మాంసం పదార్థాలను సరైన లేబులింగ్‌ లేకుండా నిల్వ చేశారని వెల్లడించారు. దీంతో లైసెన్స్‌ను సస్పెండ్‌ చేశామని, సస్పెన్షన్‌ కాలంలో ఆహార పదార్థాలను తయారీ, విక్రయించడం నిలిపివేయాలని ఆదేశించినట్లు ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ అంకిత్‌రెడ్డి స్పష్టం చేశారు.

కస్టడీ నుంచి పారిపోయిన ఖైదీకి ఏడు నెలల జైలు

జగిత్యాలజోన్‌: పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, కస్టడీ నుంచి పారిపోయిన ఖైదీ మిట్టపల్లి లక్ష్మణ్‌కు ఏడు నెలల జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ జగి త్యాల రెండో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ యేగి జానకి శుక్రవారం తీర్పు చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న లక్ష్మణ్‌ను వేములవాడ కోర్టుకు తరలిస్తు ండగా, జగిత్యాల బస్టాండ్‌లోని మూత్రశాలకు వెళ్లి హ్యాండ్‌కఫ్స్‌, చైన్‌ను అక్కడే వదిలి పారిపోయాడు. ఎస్కార్ట్‌ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు కాగా, విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది.

ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడికి ఏడాది జైలు

జగిత్యాలజోన్‌: ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని వేధించి, చంపుతానని బెదిరించిన యువకుడికి ఏడాది జైలు శిక్ష, రూ.700 జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జి జి. సునీత రవీందర్‌రెడ్డి శుక్రవారం తీర్పు చెప్పారు. కొడిమ్యాల మండలానికి చెందిన యువతిని రాజన్న సిరిసిల్ల జిల్లా ముద్దపల్లికి చెందిన ఇల్లంతకుంట వినీల్‌ తేజ ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తూ బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కొడిమ్యాల పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement