బోయినపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసైన యువకుడు అమ్మమ్మ బంగారు గొలుసు చోరీ చేసి కటకటాలపాలయ్యాడు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ముష్ణం వెంకటేశ్ హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. సొంతూరిలోనూ బెట్టింగ్ కోసం భార్య బంగారు నగలు తాకట్టు పెట్టి డబ్బులు పోగొట్టుకున్నాడు. తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. పోగొట్టుకున్న డబ్బులను తిరిగి సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనానికి పథకం వేశాడు. ఒంటరిగా ఉంటున్న తన అమ్మమ్మ బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన బొంగోని రాజవ్వ మెడలో బంగారు గొలుసును చోరీ చేయాలని పథకం వేశాడు. ఈనెల 18న సాయంత్రం తన బైక్‌పై కొదురుపాకకు వచ్చిన వెంకటేశ్ మంకీ క్యాప్ పెట్టుకొని అమ్మమ్మ రాజవ్వ నోటికి తువ్వాలు అడ్డుపెట్టి బెదిరించి, మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలి కొడుకు లక్ష్మీనారాయణ ఫిర్యాదుతో బోయినపల్లి ఎస్సై ఎన్.రమాకాంత్ కేసు నమోదు చేశారు. వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో దొంగతనానికి పాల్పడ్డ వెంకటేశ్‌ను శుక్రవారం కొదురుపాక ఎక్స్‌రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 10 గ్రాముల బంగారు గొలుసు, బైక్, మొబైల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. ఈసందర్భంగా నిందితుడిని పట్టుకోవడంలో కృషిచేసిన వేములవాడ రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్, బోయినపల్లి ఎస్సై రమాకాంత్, పోలీస్ సిబ్బంది ధర్మతేజ, కాశీం, శ్రీధర్, యాకుబ్‌లను డీఎస్పీ అభినందించారు.
అప్పులు తీర్చేందుకు దొంగతనం
నిందితుడి రిమాండ్
వివరాలు వెల్లడించిన వేములవాడ
డీఎస్పీ శ్రీనివాసులు


