కరీంనగర్ టూరిజం ప్రతిపాదనలకే పరిమితం పెండింగ్‌లో హరిత హోటళ్లు శిథిలావస్థలో మ్యూజియం టూరిజం ఆఫీస్ లేదు.. రెగ్యులర్ అధికారి లేరు
కరీంనగర్ కల్చరల్: కోటలున్నాయి.. కాకతీయులు నడయాడిన ఆనవాళ్లు ఉన్నాయి... శాతవాహనుల పురావస్తు సంపద ఉంది. చారిత్రక ఆలయాలు, బౌద్ధ స్తూపాలు, జలపాతాలు, గోదావరి తీరం సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అయినా పర్యాటక పటంలో ఉమ్మడి కరీంనగర్‌కు దక్కాల్సిన ప్రాధాన్యం కనిపించడం లేదు.
టూరిజం శాఖకు దిక్కులేదు
టూరిజంశాఖకు జిల్లాలో ప్రత్యేక కార్యాలయం లేకపోవడం శోచనీయం. రెండేళ్లుగా డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉండటంతో శాఖ కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. కొత్త కలెక్టరేట్‌లోనైనా టూరిజంశాఖకు ఒక ఆఫీస్ కేటాయించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ముందుకు సాగని రివర్‌ఫ్రంట్
దిగువ మానేరు తీరాన రివర్‌ఫ్రంట్ ఏళ్లుగా ప్రకటనలకే పరిమితమైంది. గతంలో ప్రకటించిన రూ.100 కోట్ల నిధుల జీవో గడువు ముగియడంతో ఇప్పుడు ఒక ఆర్థిక సంవత్సరానికి రూ.10 కోట్లతో విడతల వారీగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన సిద్ధమైంది. ఇరిగేషన్ పనులు పూర్తయితేనే టూరి జం పనులు చేపడతామని అధికారులు చెబుతుండటంతో రివర్‌ఫ్రంట్ మరింత జాప్యం తప్పదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎలగందుల కోట వద్ద హరిత హోటల్, బొమ్మలమ్మగుట్ట త్రిభాష శాసనం వద్ద వాచ్‌మన్ వంటి డిమాండ్లూ పెండింగ్‌లోనే ఉన్నాయి.
శిథిలావస్థకు చేరిన మ్యూజియం
కరీంనగర్‌లోని ప్రభుత్వ పురావస్తు మ్యూజియాన్ని పునర్ నిర్మించాల్సిన అవసరం ఉంది. 1969లో మంత్రి పీవీ నరసింహారావు చొరవతో ఏర్పాటైన ఈ మ్యూజియానికి కొత్త భవనం నిర్మించి ఆధునీకరించాలనే డిమాండ్ ఉంది. నగరంలో నక్షత్రశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దారం నాగభూషణం సేకరించిన ప్రైవేట్ పురావస్తు సంపదను ఆయన వారసులు కోరిక మేరకు పురావస్తుశాఖ అధ్వర్యంలో నిర్వహించాల న్న డిమాండ్ వినిపిస్తోంది. నగునూరు, కొత్తపల్లి హవేలి త్రికూట ఆలయాలు, ఎలగందుల, మొలంగూర్ కోటలకు సమగ్ర అభివృద్ధి అవసరం. ఎలగందుల కోటలో నిలిచిపోయిన సౌండ్ అండ్ లైటింగ్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని, శాతవాహన యూనివర్సిటీలో శాతవాహనుడి భారీ విగ్రహంతో పాటు టూరిజం చరిత్రపై పీజీ, పరిశోధన కోర్సులు ప్రారంభించాలన్న డిమాండ్ ఉంది.
గుట్టల విధ్వంసంతో వారసత్వానికి ముప్పు
ఎలగందుల ఖిలా సమీపంలో గుట్టలు ధ్వంసమవుతున్నాయన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. సైదాపూర్ స ర్వాయి పాపన్న గుట్ట అభివృద్ధికి మంజూరైన రూ. 4.07కోట్ల పనులను పూర్తి చేసి, మరో రూ.5 కోట్లు ప్రతిపాదన పంపినట్లు అధికారులు తెలిపారు.


