జ్యోతినగర్: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌లో రేషన్‌కార్డులోని సమాచారం ఆధారంగానే వివరాలు నమోదు చేస్తున్నారు. తద్వారా కుటుంబ సభ్యుల వయసు, పుట్టిన తేదీ విషయంలో గందరగోళం నెలకొంది.
రేషన్‌కార్డు నంబరే గుర్తింపు
ప్రభుత్వం జారీచేసిన జీవో నంబర్:172 (జూలై 25, 2026) ప్రకారం ఫ్యామిలీ రిజిస్టర్ గుర్తింపు సంఖ్య రేషన్‌కార్డు నంబరే. కుటుంబ సభ్యుల పేర్లు, బంధుత్వం, వయసు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ తదితర వివరాలను పౌర సరఫరాల శాఖ నిర్వహిస్తున్న ఫుడ్ సెక్యూరిటీకార్డు (రేషన్‌కార్డు) డేటాబేస్ నుంచి ఆటోమేటిక్‌గా తీసుకునే విధానం అమలు చేస్తున్నారు.
పదేళ్ల క్రితం వివరాలే
రేషన్‌కార్డుల్లో ఏళ్లక్రితం నమోదైన వయసు లేదా పుట్టిన తేదీ వివరాలు ఇప్పటికీ సవరించకుండా ఉంటే, అవేవివరాలు ఫ్యామిలీ రిజిస్టర్‌లోనూ నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వయసు పెరిగినా సర్టిఫికెట్‌లో పాత వయసే కనిపిస్తోందని కొందరు కార్డుదారులు చెబుతున్నారు. ముఖ్యంగా వయసు ఆధారంగా అవసరమయ్యే ప్రభుత్వ సేవలు, విద్య, ఉద్యోగం, సంక్షేమ పథకాల దరఖాస్తుల సమయంలో ఇలాంటి వివరాల వ్యత్యాసాలు ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది.
డేటా సవరణపై స్పష్టత అవసరం
ఫ్యామిలీ రిజిస్టర్ అనేది మూల డేటాబేస్‌లోని కుటుంబ కూర్పును ప్రతిబింబించే రికార్డు మాత్రమే. ఇది స్వయంగా వారసత్వ హక్కును నిర్ణయించదు, ఆస్తిపై హక్కును కల్పించదు. అలాగే ఏదైనా ప్రభుత్వ పథకానికి అర్హతను స్వయంగా నిర్ధారించదని యంత్రాంగం చెబుతోంది.
2024లోనూ ఇదే పద్ధతిన..
2024లో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలెట్ ప్రక్రియ సందర్భంగా కూడా అందుబాటులో ఉన్న రేషన్‌కార్డు తదితర డేటాను ఆధారంగా తీసుకుని కుటుంబ సభ్యుల వివరాలను నిర్ధారించాలని, కొత్త సభ్యులను చేర్చడం, మరణించిన వారిపేర్లను తొలగించడం వంటి మార్పులు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇబ్బందులు లేకుండా సవరణలు
రేషన్‌కార్డులో పాత వయసు లేదా పుట్టిన తేదీ నమోదై ఉన్న కుటుంబాలకు ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌లోనూ అవే వివరాలు వస్తే.. సంబంధిత శాఖలు సమస్యను పరిశీలించాలని ఆదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా రేషన్‌కార్డు డేటా సవరణ అనంతరం ఫ్యామిలీ రిజిస్టర్‌లో వివరాలు ఎలా, ఎంత సమయంలో నవీకరించారనే దానిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఫ్యామిలీ రిజిస్టర్‌లో పాత సమాచారమే
వయసు, పుట్టినతేదీ వివరాల్లో గందరగోళం
సవరించాలని పెరుగుతున్న డిమాండ్
ఆన్‌లైన్ ద్వారా వివరాలు
ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్‌లో ప్రస్తుతం ఆన్‌లైన్ డేటాబేస్‌లోని రేషన్‌కార్డు వివరాలే వస్తున్నాయి. గతంలో నమోదైన వయసు, ఇతర వివరాలు సవరించకపోతే అవే కనిపిస్తాయి. ఫ్యామిలీ రిజిస్టర్‌లో ప్రత్యేకంగా పాత వయసును నమోదు చేయడం లేదు. రేషన్‌కార్డులో వివరాలు తప్పుగా ఉంటే ఆధారాలతో సవరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి. డేటా సరిచేసిన అనంతరం ఆన్‌లైన్ రికార్డులో నవీకరించిన వివరాలు కనిపిస్తాయి.
– కె.రవీందర్‌రావు, తహసీల్దార్, రామగుండం


