రామగిరి: కుటుంబాన్ని పోషించే భర్తే మంచానికే పరిమితమయ్యాడు.. పిల్లల భవిష్యత్ భారంగా మారింది.. చికిత్స కోసం చేసిన అప్పులు ఓ వైపు.. ఇంటి ఖర్చులు మరోవైపు.. ఏం చేయాలో తెలియక ఆ గృహిణి అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ గ్రామానికి చెందిన మెట్టు రవి గ్రామపంచాయతీ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాలకు దీపాలు అమర్చుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి నిస్సహాయస్థితిలో ఉన్నాడు. చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని రవి భార్య సంధ్య వాపోయింది. ప్రస్తుతం భర్తకు ఉపాధి లేక కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం కుమారుడు సిద్ధుతో కలిసి రత్నాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట కూర్చొని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంది. భర్త పని చేయలేని పరిస్థితిలో ఉన్నాడని, తన పిల్లలను ఎలా పోషించాలని కన్నీటిపర్యంతమైంది. ప్రమాదానికి సంబంధించిన అంశాలపై విచారణ జరిపి, రవికి తగిన సహాయం అందించి కుటుంబానికి అండగా నిలవాలని సంధ్య కోరింది. ప్రమాదానికి కారణం, బాధ్యత ఎవరిదన్నది విచారణలో తేలాల్సి ఉన్నా.. తప్పు ఎవరిదైనా దాని భారాన్ని తమ కుటుంబమే మోయాల్సి వస్తోందని పేర్కొంది. అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి బాధిత కుటుంబానికి తగిన సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రమాదంలో మంచానికే పరిమితమైన భర్త
కుటుంబ పోషణ కష్టమవుతోందని భార్య అవేదన
రత్నాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట భైఠాయింపు


