● ఫ్యాక్షన్ తరహాలో కర్రలు, బండరాళ్లతో ఇరువర్గాల ఘర్షణ
● ఆరెపల్లిలో గంటపాటు ఉద్రిక్తత
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ శివారు ఆరెపల్లిలో వివాహేతర సంబంధం విషయమై దంపతుల మధ్య నెలకొన్న వివాదం ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఫ్యాక్షన్ తరహాలో కర్రలు, బండరాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. కరీంనగర్‌రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాల పరస్పర ఫిర్యాదులతో 15మందిపై కేసు నమోదైంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆరెపల్లి హన్మాన్‌నగర్‌లో రాజు– లావణ్య దంపతులు నివాసముంటున్నారు. రాజుకు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతో లావణ్య రెండునెలలక్రితం పుట్టింటికి వెళ్లింది. భార్యను బాగా చూసుకుంటానని చెప్పి ఇటీవల ఇంటికి తీసుకొచ్చిన రాజు, మళ్లీ వేధించడంతో కుటుంబసభ్యులకు చెప్పింది. శనివారం హన్మాన్‌నగర్‌కు వచ్చిన లావణ్య కుటుంబసభ్యులతో రాజు కుటుంబసభ్యులు గొడవపడ్డారు. ఇరువర్గాల నడుమ వివాదం పెరిగి కర్రలు, బండరాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడుల్లో ఆరుగురు గాయపడగా లావణ్య తల్లి తల పగిలి పోయింది. తండ్రి, సోదరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాల పరస్పర ఫిర్యాదులతో 15మందిపై కేసు నమోదు చేశామని సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ఖోఖో విజేత మేడిపల్లి
కరీంనగర్‌స్పోర్ట్స్: ఉమ్మడి జిల్లా కళాశాలల అండర్–19 బాలికల ఖోఖో జట్టు విజేతగా టీజీఎంఎస్ మేడిపల్లి, రన్నర్‌గా టీజీఎంఎస్ నూకపల్లి జట్లు నిలిచాయి. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో శనివారం అండర్–19 ఉమ్మడి జిల్లాస్థాయి బాలికల ఖోఖో పోటీలు నిర్వహించారు. పోటీలను జిల్లా డీసీఈబీ కార్యదర్శి భగవంతయ్య ప్రారంభించారు. అండర్–19 జిల్లా కార్యదర్శి ఎల్.బన్సీలాల్, పీడీలు బి.వేణుగోపాల్, సరిత, ప్రసాద్, అశోక్, రాజశేఖర్, బానోత్ రాజు, అజీమ్, రమేశ్, లావణ్య, శ్రీనివాసు, లీలారాణి, పవన్, ప్రణీత, శ్రీవిద్య, స్వర్ణలత పాల్గొన్నారు.


