డిగ్రీ విద్యార్థుల్లో ‘జిజ్ఞాస’ | - | Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థుల్లో ‘జిజ్ఞాస’

Sep 27 2026 12:16 AM | Updated on Sep 27 2026 12:16 AM

పరిశోధన వైపు అడుగులు

సమస్యల పరిష్కారమే లక్ష్యం

రాష్ట్రస్థాయి ప్రదర్శనలో గంభీరావుపేట కళాశాల విద్యార్థులు

గంభీరావుపేట(సిరిసిల్ల): డిగ్రీ విద్యార్థులు పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించేలా ‘జిజ్ఞాస’ దోహదపడుతోంది. డిగ్రీ విద్యార్థుల్లో పరిశోధన దృక్పథాన్ని పెంపొందించడంతోపాటు సృజనాత్మకత, పరిశీలనాసక్తి, విశ్లేషణాత్మక ఆలోచనలు పెంపొందించేందుకు స్టడీ ప్రాజెక్టుల రూపకల్పనకు ‘జిజ్ఞాస’ అవకాశం కల్పిస్తోంది. గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘జిజ్ఞాస’లో భాగంగా విద్యార్థులు వివిధ అంశాలపై స్టడీ ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. బోటనీ, కెమిస్ట్రీ, ఆంగ్లం సబ్జెక్టుల్లో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి ప్రదర్శనలకు ఎంపికయ్యాయి. తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, సమస్యను గుర్తించడం నుంచి అధ్యయనం, విశ్లేషణ, పరిష్కారమార్గాల అన్వేషణ వరకు విద్యార్థులు భాగస్వాములయ్యారు. గంభీరావుపేట కాలేజీ నుంచి ఆంగ్ల, కెమిస్ట్రీ, బోటనీ ప్రాజెక్టుల్లో విద్యార్థులు వరుసగా మూడోసారి రాష్ట్రస్థాయి ప్రదర్శనలో పాల్గొన్నారు.

‘రైజింగ్‌ తెలంగాణలో ఏఐ పాత్ర’

గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఆరుగురు విద్యార్థులు ఆంగ్లం సబ్జెక్టులో స్టడీ ప్రాజెక్టు రూపొందించి రాష్ట్రస్థాయిలో పాల్గొన్నారు. ఆంగ్ల సబ్జెక్టు అధ్యాపకడు ఆంజనేయులు మార్గదర్శకత్వంలో ‘రైజింగ్‌ తెలంగాణలో ఏఐ పాత్ర’, ‘ఉద్యోగానికి సిద్ధంగా ఉండే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌’ అనే అంశాలపై ప్రాజెక్టులు రూపొందించారు. చదువు కు, పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్‌ను ఏఐ తగ్గించి విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్పించడంపై ప్రాజెక్టు రూపొందించారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

‘బయోచార్‌’ తయారీ.. భూసారం పెంపుదల

‘వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోచార్‌ తయారీ, పంట దిగుబడి పెంపుదల’ అంశంపై బోటనీ విద్యార్థులు స్టడీ ప్రాజెక్టు రూపొందించి రాష్ట్రస్థాయిలో ప్రదర్శించారు. బోటనీ లెక్చరర్‌ సుచరణ్‌ సలహాలతో వరిగడ్డి, పత్తి కర్రలు, మొక్కజొన్న కాడలు వంటి వ్యర్థాలతో కాలుష్యం, భూసారనష్టం తగ్గించడం, ఆ వ్యర్థాలతో బయోచార్‌ తయారు చేసి భూమికి సారం అందించే ప్రయత్నంతో ఆరుగురు విద్యార్థులు స్టడీ ప్రాజెక్టు తయారు చేశారు.

భూసార పరీక్ష.. ఫలితాలు

అధిక రసాయన ఎరువుల వాడకం, ఏక పంట విధానంతో భూసారం రోజురోజుకు తగ్గిపోతోంది. అందుకే స్థిరమైన పంట దిగుబడి కోసం నేలలో ఏముంది.. ఏం లోపించింది..అనే అంశాలపై గంభీరావుపేట, సిరిసిల్ల, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో గంభీరావుపేట బోటనీ విద్యార్థులు లెక్చరర్‌ వాణి ఆధ్వర్యంలో పరిశీలించి ప్రాజెక్టు రూపొందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement