● రెండు నెలలుగా మాయమవుతున్న కోళ్లు
పెద్దపల్లిరూరల్: అది పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లి గ్రామం. ఆ గ్రామ పరిసరాల్లో ఓ కొండచిలువ తిరుగుతూ కోళ్లనే ఆహారంగా తీసుకుంటున్నట్టుంది.. రెండు నెలలుగా కోళ్లు మాయమవుతున్నాయి. పొద్దున ఇంటినుంచి వెళ్లిన కోళ్లు సాయంత్రానికి ఇంటికి చేరకపోవడంతో బాధితులు కడుపుమంటతో అనుమానితులను దూషణలు చేస్తున్నారు. ఇలా రెండు నెలలు గడచింది.. చివరకు ఇదే గ్రామంలోని బొక్కల రవీందర్ ఇంట్లోకి సోమవారం ప్రత్యక్షమైన కొండచిలువ రెండుకోళ్లను మింగి ఎటూ పోలేని స్థితికి చేరింది. మంగళవారం ఉదయం గమనించిన రవీందర్ కుటుంబీకులు.. వార్డు సభ్యుడు కొంటు రాజు తదితరుల సాయంతో కొండచిలువను పట్టి ఊరుచివర గుట్ట ప్రాంతంలో వదిలేశారు. రవీందర్ ఇంట్లో కూడా కోళ్లనే తింటూ కనిపించిన కొండచిలువ.. తమ కోళ్లను కూడా మింగి ఉంటుందనే విషయాన్ని గ్రామస్తులు గ్రహించారు.


