టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఆకస్మిక సోదాలు
మీడియా కథనాలు, ఆరోపణల మేరకు దాడులు
సోదాల సమయంలోనూ ఓ బాధితుడి ఫిర్యాదు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కార్యాల యంలో ఏసీబీ దాడులు చేపట్టింది. మంగళవారం సాయంత్రం పట్టణ ప్రణాళిక విభాగానికి చేరుకున్న బృందం రాత్రి వరకు సోదాలు కొనసాగించింది. మీడియా కథనాలు, ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో రైడ్ చేసింది. సోదాల్లో భవన నిర్మాణ అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్ తదితర అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం.
టౌన్ ప్లానింగ్‌లో సోదాలు
ఆరోపణలను ఎదుర్కొంటున్న పట్టణ ప్రణాళిక వి భాగంపై ఎట్టకేలకు ఏసీబీ దృష్టి పెట్టింది. మీడియా కథనాలు, ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులు, ఆరో పణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టింది. కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న టౌన్‌ప్లానింగ్ విభాగంలోకి ఏసీబీ బృందం నేరుగా వెళ్లింది. ఆ సమయంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తన చాంబర్‌లోనే ఉన్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగానికి చెందిన డీసీపీ, ఏసీపీ, టీపీఎస్, టీపీబీవోల చాంబర్లు, క్యాబిన్లను చుట్టుముట్టారు. ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా తలుపు తోసుకొని రావడంపై డీసీపీ బషీ ర్ అభ్యంతరం వ్యక్తం చేయగా.. కాసేపు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకొంది.
భవన అనుమతులపై ఆరా
టౌన్‌ప్లానింగ్ విభాగంలోని అన్ని సెక్షన్‌న్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ‘మేం అడిగిన సబ్జెక్ట్‌లకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వండి. ఇప్పుడిచ్చే వివరాలు, తరువాత తీసుకొనే వివరాలు ఒకేలా ఉండాలి. లేదంటే ఇబ్బందులు పడతారు’ అంటూ ఏసీబీ అధికారులు హెచ్చరించారు. నగరంలో టౌన్‌ప్లానింగ్ జారీ చేసిన భవన నిర్మాణ అనుమతులు, పెండింగ్ దరఖాస్తులు, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులతో పాటు ఆ దరఖాస్తులు డిస్పోజ్ చేయకపోవడం లాంటి అంశాలనూ తనిఖీ చేసినట్లు సమాచారం.
ఫోన్‌పే లావాదేవీలు తనిఖీ
ఏసీబీ అధికారులు టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు. ఫోన్లలో ఉన్న గుగుల్ పే, ఫోన్ పేలను చెక్ చేసినట్లు సమాచారం. అనుమతులు, ఇతరత్రా పనుల కోసం ఎవరైనా ఆన్‌లైన్‌లో డబ్బులు తీసుకున్నారా అనే అనుమానంతో లావాదేవీలు చూసినట్లు వినికిడి.
సోదాల సమయంలోనే ఫిర్యాదు
సోదాలు జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి వచ్చి టౌన్‌ప్లానింగ్‌పై ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. నగరంలోని భగత్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి శ్రీపతిరావు కార్యాలయానికి వచ్చి ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డిని కలిశాడు. టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆయన్ను బయటకు వెళ్లాలని చెప్పినప్పటికీ, ఏసీబీ అధికారులు వారించి ఫిర్యాదు తీసుకున్నాడు. తీగలగుట్టపల్లిలో ఉన్న తన స్థలంలోకి చొచ్చుకువచ్చి ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేస్తున్నాడని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇక్కడ డబ్బులు ఇవ్వనిదే ఏ పని జరగదంటూ శ్రీపతిరావు ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
టెన్షన్.. టెన్షన్
ఏళ్లకాలం తరువాత నగరపాలకసంస్థ కార్యాలయ ంలో ఏసీబీ సోదాలు చేపట్టడంతో ఇతర విభాగాల ఉద్యోగులు సైతం ఎప్పుడేం జరుగుతుందో అనే భయంతో ఉన్నారు. టౌన్‌ప్లానింగ్, ఇతర విభాగాల అధికారులు కొందరు ఏసీబీ సోదాల సమాచారంతో కార్యాలయానికి కూడా రాకపోవడం విశేషం.


