కరీంనగర్ టౌన్: బాధితులకు న్యాయసాయం అందించడంలో ‘సఖి’ కేంద్రం ముందుండాలని అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే సూచించారు. కరీంనగర్ సప్తగిరికాలనీలోని సఖి కేంద్రంలో మంగళవారం నిర్వహించిన 13వ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గృహహింస నిరోధక చట్టం– 2005 ప్రకారం కోర్టుల్లో నమోదయ్యే కేసుల్లో జాప్యం లేకుండా, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ సమన్వయంతో బాధితులకు త్వరితగతిన న్యాయసాయం అందించడంలో సఖి కేంద్రం ముందుండాలని ఆదేశించారు. పీసీఆర్ కోర్టుల ద్వారా దాఖలయ్యే గృహహింస కేసుల్లో రక్షణాధికారి విచారణ నివేదికల ప్రక్రియను ఐసీడీఎస్ సీడీపీవోల సమన్వయంతో పెండింగ్ లేకుండా పూర్తిచేయాలని, పోలీస్ స్టేషన్లలోని వరకట్న వేధింపుల కేసుల స్టేటస్ వివరాలను అందించాలని సూచించారు. సఖి సెంటర్ నిర్వాహకురాలు దామెర లక్ష్మి పూర్వ చర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, మెప్మా పీడీ స్వరూప రాణి, అడ్వకేట్ మహేశ్ పాల్గొన్నారు.


