కరీంనగర్: కార్పొరేట్ తరహా విద్య, వైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అభివృద్ధి సంఘ సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల కల్పన, నూతన భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.కోట్ల నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు నిరుపేదలు ఎక్కువగా వస్తుంటారని, వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రి అవుట్ పోస్ట్ వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. ఆస్పత్రి అభివృద్ధికి రూ.40 లక్షలు మంజూరు చేశామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆస్పత్రిలో కనీస అవసరాలకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఆస్పత్రిలో ఒక హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. ఇది ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంహెచ్‌వో వీరారెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తాఖీయుద్దీన్‌ఖాన్, ఆర్‌ఎంవో నవీన తదితరులు పాల్గొన్నారు.


