కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లర్స్ దోపిడీ కేసులో ప్రధాన నిందితులపై కరీంనగర్ పోలీసులు కొరడా ఝళిపించారు. ముఠాకు చెందిన ఐదుగురిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. మే 3న పీఎంజే జువెల్లర్స్‌లోకి చొరబడిన దుండగులు సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపి, సుమారు రూ.82 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు దర్యాప్తులో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీరా సింగ్, రావిష్‌కుమార్ అలియాస్ ప్రద్యుమాన్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్, యాదవ్ అలియాస్ జైనుల్ అబ్దిన్, మొహమ్మద్ ఆదిల్‌ఖాన్‌పై సోమవారం పీడీ యాక్ట్ అమలు చేశారు. నిందితులకు కరీంనగర్ జిల్లా జైలులో నిర్బంధ ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. నిందితుల నేర కార్యకలాపాలను అరికట్టడం, ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, భవిష్యత్‌లో ఇలాంటి నేరాలకు పాల్పడే వారిలో భయాన్ని కలిగించడమే పీడీయాక్ట్ అమలు ఉద్దేశమని సీపీ తెలిపారు. పీడీయాక్ట్ అమలులో కీలకంగా వ్యవహరించిన కరీంనగర్ టౌన్ ఏసీపీ ఎన్.వెంకటస్వామి, టూటౌన్ సీఐ కె.సృజన్‌రెడ్డి, పీడీ సెల్ సిబ్బంది పండరి, హెడ్ కానిస్టేబుల్ శంకర్‌ను సీపీ అభినందించారు.


