వేములవాడ: అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడడం, జూదం నిర్వహించడం, చిన్నచిన్న నేరాలకు పాల్పడడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. భక్తుల రద్దీ ప్రాంతంలో ఇటీవల తాడు ఆట పేరుతో జూదం నిర్వహిస్తున్న వైనాన్ని సాక్షి ప్రచురించింది. సాక్షి కథనంపై పోలీసులు సీరియస్‌గా వ్యవహరించి నిఘా పెంచారు. సోమవారం తాడు ఆట పేరుతో జూదం నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తాడు ఆట నిర్వహిస్తున్న ప్రదేశంపై దాడి చేసి జూదం నిర్వహిస్తున్న సురేందర్, దేవందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి వారి వద్ద నుంచి తాడు ఆటకు ఉపయోగించే సామగ్రి, అప్సర పెన్సిళ్లు, రూ.2వేల నగదును స్వాధీనపరచుకొని రిమాండ్‌కు తరలించారు. నిందితులు హన్మకొండ జిల్లా ఐనవోలు గ్రామానికి చెందిన రాయపురం సురేందర్, అదే జిల్లా ఆత్మకూరుకు చెందిన పల్లకొండ దేవేందర్‌గా గుర్తించినట్లు చెప్పారు.


