వనభోజనాల్లో విషాదం | - | Sakshi
Sakshi News home page

వనభోజనాల్లో విషాదం

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

● ఈతకు వెళ్లి మానేరులో మునిగి వ్యక్తి మృతి

సుల్తానాబాద్‌రూరల్‌: ఆదివారం సరదాగా గడిపేందుకు వనభోజనాలకు వెళ్లిన కుటుంబంలో విషాదం అలుముకుంది. అప్పటి వరకు అందరూ కలిసి వంటలు పూర్తి చేసుకొని.. భోజనాలకు సిద్ధమవుతుండగా ఈతకొట్టేందుకు వెళ్లి మృత్యువాతపడ్డాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ఎస్సై చంద్రకుమార్‌, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు. సుల్తానాబాద్‌ పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన కారు డ్రైవర్‌ ఎం.డి.జహంగీర్‌(38) ఆదివారం భార్య, కూతుళ్లు, అల్లుళ్లు, తన బాబాయి కూతుళ్లు, అల్లుళ్లతో కలిసి నీరుకుల్లలోని మానేటి శ్రీరంగనాయకస్వామి ఆలయం సమీపంలో వన భోజనాలకు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి వంటలు చేసుకున్నారు. భోజనం చేసేందుకు సిద్ధమవుతుండగా తన బాబాయ్‌, అల్లుళ్లతో కలిసి మానేరువాగులో ఈత కొట్టేందుకు దిగారు. జహంగీర్‌ ఊపిరి ఆడక ఈత కొట్టలేకపోయాడు. నీటిలో మునిగిపోతున్న జహంగీర్‌ను కుటుంబ సభ్యులు కాపాడేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండాపోయింది. దీంతో నీరుకుల్ల గ్రామానికి చెందిన గజ ఈతగాళ్లను పిలిపించి గాలించగా మృతదేహం బయటపడింది. పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

ఒకరిపై దాడి.. కేసు నమోదు

మానకొండూర్‌: మండలకేంద్రంలోని తూర్పు దర్వాజా సమీపంలో శనివారం రాత్రి ఓ వ్యక్తిపై ఇద్దరు దాడి చేయగా.. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మానకొండూర్‌ రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన పార్వతం నరసింహ(30) తన తమ్ముడు సిరిగిరి హరీశ్‌తో కలిసి కిరాణాషాపునకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా ఇదే గ్రామానికి చెందిన సుధీర్‌, ప్రణయ్‌, చింటూ అడ్డుకుని దాడి చేశారు. నరసింహ రోడ్డు పక్కనున్న డ్రైనేజీలో గాయమైంది. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ పి.శ్రీలత తెలిపారు.

గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్‌

జమ్మికుంట: పట్టణంలో గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 230 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. టౌన్‌ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మంద్రమర్రికి చెందిన నాగిరెడ్డి హరిప్రసాద్‌, వెంకటాపురం గ్రామానికి చెందిన దుర్గం కార్తీక్‌ గంజాయికి బానిసయ్యారు. గంజాయి విక్రయించడం ద్వారా సులభంగా డబ్బు సంపాదించొచ్చని ఆలోచన చేశారరు. ఈ నెల 15న మహారాష్ట్రలోని నాగపూర్‌ వెళ్లారు. అక్కడ గుర్తు తెలియని ఓ వ్యక్తి వద్ద రూ.11,400 విలువ చేసే 230 గ్రాముల గంజాయి కొనుగోలు చేశారు. ఆదివారం జమ్మికుంటకు వచ్చి ఎఫ్‌సీఐ ప్రాంతంలో గంజాయి అమ్మేందుకు యత్నిస్తుండగా గస్తీలో ఉన్న పోలీసులు పట్టుకున్నారు. వారినుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement