ఫొటో తీయట్లే.. బిల్లు పడ్తలే! | - | Sakshi
Sakshi News home page

ఫొటో తీయట్లే.. బిల్లు పడ్తలే!

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

ఇందిరమ్మ ఇళ్లకు ఫొటో గ్రహణం అప్‌లోడ్‌ చేయడంలో అధికారుల నిర్లక్ష్యం నిలిచిపోతున్న ఇంటి నిర్మాణాలు పూర్తయిన నివాసాలకూ అందని బిల్లులు నగరంలోని లబ్ధిదారులకు తప్పని అప్పుల తిప్పలు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు వార్డు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. క్షేత్రస్థాయి పరిశీలన, జియో ట్యాగింగ్‌ సకాలంలో జరగకపోవడంతో లబ్ధిదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఫొటో తీసే తీరిక లేక లబ్ధిదా రులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. తీరిక లేక కాదని, కావాలనే చేస్తున్నారనే అనుమానమూ ఉంది. ప్రస్తుతం నగరంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ఇది ప్రధాన సమస్యగా మారింది.

బిల్లుల చెల్లింపు ఇలా

ఇందిరమ్మ పథకంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు నాలుగు విడుతల్లో చెల్లిస్తోంది. పునాది పూర్తి చేస్తే రూ.లక్ష, గోడల నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష, స్లాబ్‌ పూర్తయ్యాక రూ.2 లక్షలు, తలుపులు, కిటికీలు, రంగులు సహా పనులు మొత్తం పూర్తయ్యాక రూ.లక్ష అందిస్తోంది. ప్రతి దశ పూర్తయిన తరువాత నగరంలో సంబంధిత వార్డు అధికారులు ఇందిరమ్మ ఇండ్ల మొబైల్‌ యాప్‌ ద్వారా నిర్మాణ ఫొటోలను జియోట్యాగింగ్‌తో అప్‌లోడ్‌ చేయాలి. ఆమోదం పొందితే లబ్ధిదారుల ఖాతాలో బిల్లులు జమవుతాయి.

ఫోటో తీయట్లే

నగరంలోని పలు డివిజన్లలో వార్డు అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. నిర్మాణం పూర్తయ్యాక వార్డు అధికారులకు సమాచారం ఇస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హౌసింగ్‌ అధికారులూ పట్టించుకోవడం లేదు. ఎస్‌ఐఆర్‌ విధుల్లో ఉన్నామని, బిజీగా ఉన్నామని, ఫోన్‌ కూడా లిఫ్ట్‌ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎస్‌ఐఆర్‌ ఈ నెల 10వ తేదీతో ముగియగా.. రెండు నిమిషాల సమయం కేటాయించే తీరిక లేకుండా చేసే విధులు ఏంటని లబ్ధిదారులు ప్రశ్ని స్తున్నారు. డివిజన్‌లో ఇతర పనుల కోసం తిరుగుతున్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం ఫొటో తీసే అవకాశం ఉన్నా.. కావాలనే వాయిదా వేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆరు నెలలైనా బిల్లు జాడ లేదు...

కొంతమంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి ఆరు నెలలుగడుస్తున్నా బిల్లులు రావడం లేదు. నిర్మాణాలను దశలవారీగా ఫొటో తీయకపోవడంతోనే బిల్లులు పడడం లేదని వాపోతున్నారు. అప్పులు చేసి ఇంటిని నిర్మిస్తే వార్డు అధికారుల నిర్వాకంతో ఆర్థికభారం పడుతోందని అంటున్నారు. ఈ సమస్యపై అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పందన కనిపించడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలని, సకాలంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇండ్ల వివరాలు

నగరంలో డివిజన్లు 66

మంజూరైన ఇండ్లు 1,737

నిర్మాణంలో ఉన్నవి 1,620

పూర్తయినవి 221

25వ డివిజన్‌ పరిధిలోని సుభాష్‌నగర్‌లో పిల్లి శ్రీలత ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు బిల్లు రావడం లేదు. ఇంటి నిర్మాణానికి చేసిన అప్పుల వడ్డీలు పెరిగిపోతోంది. నెల, రెండు నెలల్లో బిల్లులు వస్తే చెల్లించొచ్చు అనుకుంటే ఆరు నెలలు గడుస్తున్నా బిల్లు జాడ లేకపోవడంతో అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి పెంచుతున్నారు.

నగరపాలకసంస్థ 27వ డివిజన్‌ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన మణిమాలకు సంబంధించిన నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఇది. పునాదిస్థాయి పూర్తయిన తరువాత రూ.లక్ష బిల్లు వచ్చింది. పైకప్పు వరకు గోడల నిర్మాణం పూర్తయింది. వార్డు అధికారి వచ్చి ఇంటినిర్మాణ ఫొటో తీసి, జియోట్యాగింగ్‌తో యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే మరో రూ.లక్ష బిల్లు వస్తుంది. 45 రోజులు అవుతున్నా వార్డు అధికారికి ఫొటో తీసే తీరిక లేకుండా పోయింది. ఫొటో తీస్తేనే స్లాబ్‌ వేసుకోవాల్సి ఉండడంతో లబ్ధిదారులకు తప్పనిసరి నిరీక్షణ తప్పడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement