అరకొర మందులతో రోగుల అవస్థలు నిర్వహణ లేక పెచ్చులూడుతున్న పాత భవనం నేడు జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశం
కరీంనగర్: పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాల న్న ప్రభుత్వ లక్ష్యం కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు. ఒకవైపు నిధుల లేమి.. మరో వైపు వైద్యుల కొరత.. మందుల అరకొర సరఫరా.. వెరసి ఆస్పత్రి నిర్వహణ భారంగా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించనున్న ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కలెక్టర్ చిత్రామిశ్రా అధ్యక్షతన జరిగే సమావేశానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యే అవకాశముంది. సదుపాయాలు, నిధుల కొరత, మందులు, వైద్యుల నియామకాలు, భవనాల మరమ్మతులు తదితర అంశాలపై చర్చించనున్నారు.
బకాయిలు రాక భారంగా నిర్వహణ
ఆస్పత్రికి ఆరోగ్యశ్రీ పథకం నుంచి సుమారు రూ.4.5 కోట్లు, మెడికల్ బిల్లులకు సంబంధించి రూ.4 కోట్లు, విద్యుత్ బిల్లులకు మరో రూ.4 కోట్లు ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉండడంతో నిర్వహణపైనా ప్రభావం పడుతోంది. మందులను బైహ్యాండ్ సప్లయి ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పాత బిల్లులు చెల్లించకపోవడంతో కొత్తగా మందులు సరఫరా చేసేందుకు నిర్వాహకులు వెనుకంజ వేస్తున్నారు.
క్రిటికల్ కేర్‌కు వైద్యులేరీ?
జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్ విభాగాన్ని ప్రారంభించి ఏడాది గడుస్తున్నా సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకాలు జరగలేదు. 2డీ ఎకో మిషన్ ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించే వైద్యులు అందుబాటులో లేరు. క్రిటికల్‌కేర్‌కు అవసరమైన కార్డియాక్, న్యూరో, నెఫ్రాలజీ వైద్య సిబ్బందిని నియమించాల్సి ఉంది.
పెచ్చులూడుతున్న పాత భవనం
జీజీహెచ్‌లో మరో ప్రధాన సమస్య పాత భవనం. సరైన నిర్వహణ, మరమ్మతులు లేక భవనం పలు చోట్ల పైకప్పులు, గోడల నుంచి పెచ్చులు ఊడిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రోగులు, సహాయకులు, వైద్య సిబ్బందికి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భవనానికి తక్షణ మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది. నిధుల కొరతను అధిగమించేందుకు బకాయిలు విడుదల చేయడంతో పాటు ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. నిధుల విడుదల, వైద్యుల నియామకాలు, మందుల సరఫరా, భవనాల మరమ్మతులకు కార్యాచరణ రూపొందిస్తేనే జీజీహెచ్‌లో సేవలు మెరుగుపడే అవకాశముంది.


