కరీంనగర్ కార్పొరేషన్: అర్హుల ఓటు ఒక్కటి కూడా తొలగిపోకుండా బీఎల్‌ఏలు చూడాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కో ఇన్‌చార్జి సచిన్ సావంత్ అన్నారు. ఆదివారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లా, కరీంనగర్ కార్పొరేషన్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పొలిటికల్ అడ్వైజరీ కమిటీల సమావేశాలు వేర్వేరుగా నిర్వహించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లకు పైగా తొలగిపోతుండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలగనున్న ఓట్లపై మరోసారి దృష్టి సారించి, అర్హులైన ఓటర్లు ఉంటే తిరిగి చేర్చేలా చర్యలు తీసుకో వాలన్నారు. సెక్యులర్ ఓట్లు తొలగించేందుకు బీజే పీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు. కాంగ్రెస్, నేతలపై సామాజిక మాధ్యమాల్లో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూ చించారు. ఈ నెల 31లోగా మండల, డివిజన్ కమిటీలు పూర్తి చేయాలన్నారు. కాగా కరీంనగర్‌లో పార్టీకి నాయకత్వ లోపం ఉండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్‌నాయక్ ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ ఎత్తివేతతో తిరిగి పార్టీలోకి వచ్చిన పురుమల్ల శ్రీనివాస్ కార్యాలయానికి వచ్చి, తనను కూడా పీఏసీ సమావేశాలకు ఆహ్వానించాలని సావంత్‌ను కోరారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, నాయకులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వుట్కూరి నరేందర్ రెడ్డి, కర్ర సత్య ప్రసన్నరెడ్డి, ఎండీ.తాజ్, పులి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


